పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బంగాల్లోని బీర్బూమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు.. అనంతరం అనారోగ్యం పాలైనట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే..
మయూరేశ్వర్ బ్లాక్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పప్పు నిల్వ ఉంచిన పాత్రలో ఓ పామును గుర్తించినట్లు పాఠశాల సిబ్బంది ఒకరు తెలిపారు. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు.. అనంతరం వాంతులు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వెంటనే వారందరిని రాంపుర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఘటనపై మయూరేశ్వర్ బ్లాక్ డెవలప్మెంట్ అధికారి దీపంజన్ జానా స్పందించారు. పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వెంటనే సమాచారాన్ని జిల్లా పోలీసు అధికారికి తెలిపినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులెవ్వరికి ప్రాణహాని లేదని అధికారి దీపంజన్ జానా స్పష్టం చేశారు. ఒక్క విద్యార్థి తప్ప, మిగతా వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొంది.. అనంతరం డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. కాగా ఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. జరిగిన పరిణామంపై అక్కడి వారిని ఆరా తీశారు. పిల్లలు అస్వస్థతకు గురవడంపై ఆగ్రహించిన వారి తల్లిదండ్రులు హెడ్మాస్టర్కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారని, అనంతరం ఆయన బైక్‌ను ద్వంసం చేశారని పోలీసులు తెలిపారు. వారందరిని శాంతింపజేసినట్లు వారు వెల్లడించారు.
ఇవీ చదవండి:
చలికి దిల్లీ గజగజ.. దట్టంగా పొగమంచు.. 260 రైళ్లు, 30 విమానాలు ఆలస్యం
స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు విద్యుత్ వెలుగులు.. కశ్మీరీ గ్రామస్థుల సంబరాలు