farmers protest: సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతన్నలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంపై ఆయా రాష్ట్రాలదే నిర్ణయమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయం రాష్ట్రాలదే అయినందున వాటిపై తుది నిర్ణయం కూడా వారిదేనని స్పష్టంచేశారు.
farmer protest narendra singh tomar: ఈ సందర్భంగా రైతులు తమ ఆందోళనలను విరమించుకోవడాన్ని కేంద్రమంత్రి స్వాగతించారు. మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేంద్రం విడుదల చేసే నగదు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే చేరుతోందని ఉద్ఘాటించారు.
వ్యవసాయ చట్టాల రద్దు నేపథ్యంలో ఉద్యమ సమయంలో వారిపై నమోదైన కేసులతో పాటు కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతుసంఘాల నేతలకు ఓ లేఖ రాసింది.
"రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు హరియాణా రాష్ట్రాలు అంగీకరించాయి. దిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటాం"
--కేంద్రం లేఖ
అయితే, వీటిపై ఆయా రాష్ట్రాలు మాత్రమే ప్రకటన చేస్తాయని వెల్లడించింది. ఇక ఏడాది కాలంగా రైతు నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్.. ఇది ఎవరి విజయమో? ఓటమో కాదన్నారు.
ఇదిలాఉంటే, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేసిన ఆందోళన దాదాపు సంవత్సరం పాటు కొనసాగింది. గతేడాది నవంబర్ 26న మొదలైన ఉద్యమం ఏడాది పూర్తి చేసుకునే సమయంలోనే వాటిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లులను కూడా నవంబర్ 29న పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: