వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు (farm laws repeal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయినా ఇటు రైతు సంఘాల నేతల్లో, అటు వివిధ రాజకీయ పార్టీల నాయకుల్లో ఇంకా చర్చ నడుస్తోంది. సాగు చట్టాలను పార్లమెంట్ సాక్షిగా రద్దు చేస్తేనే ఆందోళను విరమిస్తామని రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయిత్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేగాకుండా సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులు (Samyukta Kisan Morcha) కూడా ప్రధాని చేసిన ప్రకటనపై నమ్మకం లేక తదుపరి ఆందోళనలు యథాతథంగా జరుగుతాయని ప్రకటించారు. మరికొన్ని డిమాండ్లతో కూడిన ఓ లేఖను మోదీకి పంపుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటనపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాలను ఎన్నికల (up election 2022) నేపథ్యంలోనే వ్యవసాయ చట్టాలను రద్దు (farm laws repeal) చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పాగా వేసేందుకు మాత్రమే ఎన్డీఎ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు పేర్కొన్నాయి. 2022లో జరిగే ఎన్నికలు ముగియగానే తిరిగి వ్యవసాయ చట్టాలను (farm laws latest news) ప్రవేశపెట్టే విధంగా భాజపా వ్యూహత్మకంగా అడుగు వేస్తోందని చెప్పుకొచ్చాయి.
"సాగు చట్టాల విషయంలో మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమైంది. రాజ్యాంగబద్ధ పదవులను ఉపయోగించి వచ్చే ఎన్నికలు పూర్తి అయిన తరువాత తిరిగి తీసుకువస్తారు. ఇదే విషయాన్ని సాక్షి మహరాజ్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా స్వయంగా తెలిపారు.' అని సమాజ్వాదీ పార్టీ పేర్కొంది.
మీ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు..
సాగు చట్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గతంలో కూడా మోదీ ఇలాంటి మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించారని ఆరోపించారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ రైతు సంఘాలు దిల్లీ సరిహద్దు వీడకపోవడమే ఇందుకు నిదర్శన అని తెలిపారు.
వారి వ్యాఖ్యలతో...
సాగు చట్టాలపై రైతుల సంఘాల ప్రతినిధులు, విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేసేందుకు... రాజస్థాన్ గవర్నర్, కొందరు భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా కారణమయ్యాయి.
'మూడు వ్యవసాయ చట్టాల్లోని సానుకూల అంశాలను రైతులకు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నించాం. కానీ వారు వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇందుకు నిరసన తెలిపారు. వారి అందోళనను కేంద్ర అర్థం చేసుకుంది. ఎట్టకేలకు చట్టాలను ఉపసంహరించుకోవాలని భావించింది. ఏదేమైనా ఇది మంచి నిర్ణయం. తిరిగి చట్టాలు చేయాల్సి వస్తే మాత్రం కచ్చితంగా తీసుకుని వస్తాం' అని రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా అన్నారు.
ఓ మీడియా సమావేశంలో ఉన్నావ్ భాజపా ఎంపీ సాక్షి మహరాజ్ కూడా ఇలానే స్పందించారు. 'చట్టాలను వెనక్కి తీసుకున్నాం. మళ్లీ చట్టాలు చేస్తాం. వాటిని అవసరాన్ని బట్టి ఏ క్షణంలో అయినా తిరిగి తీసుకుని వస్తాం. వారి ఉద్దేశాలు చెడ్డవైనా.. ప్రధాని చట్టాల కంటే ప్రజలకే ఎక్కువ విలువ ఇచ్చారు. ఇందుకు మోదీకి కృతజ్ఞతలు. పాకిస్థాన్ , ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారికి తగిన సమాధానం లభించింది.' అని మహరాజ్ అన్నారు.
భాజపా వాదన ఇలా...
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాము సాగు చట్టాలను వెనక్కి తీసుకోలేదని భాజపా నేతలు చెబుతున్నారు. ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో (up election 2022) భాజపా సుమారు 300కు పైగా అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత్కు ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ, యూపీకి ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ తప్ప మరెవరూ ప్రత్యామ్నాయం లేరని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: 'యథావిధిగా రైతు నిరసనలు- కొత్త డిమాండ్లతో మోదీకి లేఖ'