ఉత్తర్‌ప్రదేశ్ ఉపఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. మైన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె ఘన విజయం సాధించారు. డింపుల్ తన సమీప భాజపా అభ్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యాపై 2.88 లక్షల ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు.
ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 ఎన్నికల్లో ములాయం 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో భాజపా అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై గెలుపొందారు. ఇప్పుడు డింపుల్‌కు 2,88,461 లక్షల మెజార్టీ లభించింది. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా పిలిచే మైన్‌పురికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగగా.. 56 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఎస్పీకి 64.2 శాతం ఓట్లు రాగా.. భాజపాకు 34.1 శాతం ఓట్లు వచ్చాయి.
రాంపుర్‌లో భాజపా అభ్యర్థి ఆకాశ్ సక్సేనా 33,702 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి ఎస్పీ అభ్యర్థి అసిం రాజాపై గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో 33 శాతం కంటే తక్కువగా ఓటింగ్ నమోదైంది. ఖతౌలీ నియోజకవర్గంలో ఎస్పీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అభ్యర్థి మదన్ భయ్యా 22,143 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి రాజ్‌కుమారిపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 56.46 శాతం ఓటింగ్ నమోదైంది.
బిహార్ ఉప ఎన్నిక..
బిహార్‌లోని కుఢనీ స్థానంలో భాజపా జయకేతనం ఎగురవేసింది. భాజపా అభ్యర్థి కేదార్ ప్రసాద్ గుప్తా 3,645 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి జేడీయూకి చెందిన మనోజ్ సింగ్‌పై గెలుపొందారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌పై అనర్హత వేటు పడటంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. నాలుగు నెలల క్రితం భాజపా, జేడీయూ మధ్య బంధం తెగిపోయాక జరిగిన ఈ ఉప ఎన్నికలో విజయం దక్కడం కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికార మహా కూటమిలో ఆర్జేడీ భాగంగా ఉంది
ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సహానిపై అనర్హత వేటు పడగా.. కుర్హానీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో ఐదుగురు స్వతంత్రులు ఉన్నారు. అయితే ప్రధానంగా గుప్తా, కుశ్వాహ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరూ మాజీ ఎమ్మెల్యేలు.
ఒడిశా ఉప ఎన్నిక..
ఒడిశాలోని పదమ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో అధికార బిజూ జనతాదళ్ పార్టీ అభ్యర్థి బర్శా సింగ్ 42,679 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థిపై గెలుపొందారు.
రాజస్థాన్ ఉప ఎన్నిక..
రాజస్థాన్‌లోని సర్దార్‌శహర్ శాసనసభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ శర్మ 26,852 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి అశోక్ కుమార్‌పై గెలుపొందారు.
ఛత్తీస్‌గఢ్ ఉప ఎన్నిక..
ఛత్తీస్‌గఢ్‌లోని ఎస్టీ రిజర్వ్డ్ భానుప్రతాప్‌పుర్ అసెంబ్లీ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మండి 21,171 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి బ్రహ్మానంద నేతమ్‌పై విజయం సాధించారు