Southern Railway Covid Guidelines: తమిళనాడులో కొవిడ్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న క్రమంలో దక్షిణ రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి మాత్రమే సబ్అర్బన్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు టికెట కౌంటర్ వద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించినవారికే టికెట్ అందిస్తామన్నారు అధికారులు. జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయన్నారు.
అంతేకాక దక్షిణజోన్లోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో మాస్కు లేకుండా కనిపిస్తే రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది రైల్వే జోన్. ప్రయాణికులు కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించింది.
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా.. జనవరి 6 నుంచే పలు రకాల ఆంక్షలను విధిస్తూ వస్తోంది దక్షిణ రైల్వే జోన్. జనవరి 6 నుంచి రైళ్లను 50 శాతం సీటింగ్ సామర్థ్యంతోనే నడుపుతోంది.
తమిళనాడులో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 27,76,413కు చేరింది. కొత్తగా 8,981మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారితో మరో 8 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 36,833కు చేరింది.
ఇదీ చూడండి: బీఎండబ్ల్యూ కార్లతో నక్సల్స్ లగ్జరీ లైఫ్- పోలీసులు షాక్