Monsoon in Kerala: ఆరు రోజుల విరామం తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళ వైపు వేగంగా పయనిస్తున్నాయి. గురువారం నాటికి దక్షిణ శ్రీలంకను పూర్తిగా ఆవహించాయి. రానున్న 48 గంటల్లో లక్షదీవులు, మాల్దీవులను రుతుపవనాలు చుట్టుముట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ కేరళతో పాటు లక్షదీవుల్లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల గమనాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉన్నామని పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే, ఈసారి ముందుగానే అవి వస్తున్నట్టు వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించింది. మే 27నే ఇవి కేరళకు చేరుకుంటాయని అంచనా వేసింది. అయితే, చెప్పిన సమయానికి నాలుగు రోజులు తేడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు గత నెలలో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు చెప్పారు. సాధారణం కంటే చాలా ముందుగానే(మే 16నే) అండమాన్ నికోబార్ దీవులను తాకాయని తెలిపారు. అయితే, మే 20 తర్వాత బంగాళాఖాతంలో రుతుపవనాల కదలికల్లో పెద్దగా మార్పులు సంభవించలేదని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకుడు ఆక్షయ్ దేవరస్ వెల్లడించారు.
సౌత్‌లో వర్షాలు.. నార్త్‌లో ఎండ!
కాగా, మార్చి 1 తర్వాత దేశంలో మూడు శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. భారత ద్వీపకల్పంలోనే ఎక్కువ వర్షాలు కురిశాయి. తీవ్రమైన వడగాలుల ప్రభావంతో ఉత్తరాది ప్రాంతాల్లో పొడివాతావరణమే నెలకొంది. వాయవ్య భారతదేశంలో 65 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. మధ్య భారతంలో 39 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. తూర్పు, ఈశాన్య భారత్‌లో 27 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. ద్వీపకల్ప ప్రాంతమైన దక్షిణ భారతదేశంలో 76 శాతం వర్షాలు అధికంగా కురిశాయి.
ఇదీ చదవండి: