బంగాల్‌లో మమతా బెనర్జీని గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గ సమర్థ సారథి కోసం అన్వేషిస్తోంది! పైకి బహిరంగంగా చెప్పకున్నా దీదీని ఢీకొట్టి రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడి కోసం దుర్భిణి పెట్టి మరీ వెతుకులాడుతోంది. ఈ క్రమంలో వారికి ప్రముఖంగా కనిపిస్తున్న పేరు.. సౌరవ్ గంగూలీ! ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదా తన రాజకీయరంగ ప్రవేశంపై వస్తున్న వార్తలను ఖండించకపోవడంతో పాటు నర్మగర్బ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'ఏం జరుగుతుందో చూద్దాం. నా జీవితం గతంలో ఎన్నో అనూహ్య మలుపులు తీసుకుంది' అన్నది రాజకీయ ప్రవేశంపై గంగూలీ తాజా స్పందన!
ఇవీ చదవండి: ప్రచార పర్వం- రసవత్తరంగా బంగాల్ రాజకీయం
గుండెపోటు రాకపోయి ఉంటే!
నిజానికి దాదా రాజకీయ అరంగేట్రం ఖరారైనట్లు గత ఏడాది చివర్లోనే వార్తలొచ్చాయి. అయితే- జనవరిలో ఆయనకు స్వల్ప గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. తర్వాత మళ్లీ స్టెంట్లు వేయించుకున్నారు. అనారోగ్యం కారణంగానే ఆయన రాజకీయరంగ ప్రవేశంపై పునరాలోచనలో పడ్డారని, లేదంటే ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉండేవారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల గంగూలీ అనారోగ్యం బారిన పడినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరామర్శించారు. దాదాను చూసేందుకు బంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లడం గమనార్హం.
ప్రస్తుతం దాదా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఆ సంస్థ కార్యదర్శిగా ఉన్నారు. వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.
ఇవీ చదవండి: మిథున్ 'చక్రం'.. భాజపా కొత్త అస్త్రం!
నా జీవితంలో చాలా విషయాలు హఠాత్తుగా జరిగినవే. టీమిండియా నాయకత్వం దగ్గరి నుంచి బీసీసీఐ అధ్యక్ష పీఠం వరకు అన్నీ అలా జరిగినవే. నా జీవితం అలానే ఉంటోంది మరి. రాజకీయాల విషయం ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం.
-సౌరవ్ గంగూలీ.
ఇవీ చదవండి: బంగాల్ దంగల్‌తో 'టాలీవుడ్'లో చీలిక!
ఇవీ చదవండి: 'త్వరలోనే దేశానికి 'మోదీ' పేరు!'
ఆ మాటలే సంకేతాలా?
రాజకీయాల్లో ప్రవేశంపై చాన్నాళ్లుగా మౌనం వహిస్తున్న దాదా ఎట్టకేలకు సోమవారం పెదవి విప్పారు. తన అరంగేట్రంపై స్పష్టతనివ్వకపోయినా.. రాజకీయాలపై దాదా తాజాగా సానుకూలంగానే మాట్లాడారు. 'రాజకీయ రంగం చెడ్డదేం కాదు. అ రంగానికి చెందిన పలువురు నేతలు కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. రాజకీయాలు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ రంగంలో మంచి వ్యక్తులు ఉండాలి. ఎవరికి ఇష్టమైన పనిని వారు చేయడం ముఖ్యం' అని ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఆయన పేర్కొన్నారు.
అన్నీ బేరీజు వేసుకున్నాకే..
భవిష్యత్తు ప్రణాళికలపై అడిగిన ఓ ప్రశ్నకు.. 'ఎలాంటి అవకాశాలు వస్తాయో చూసి తగిన నిర్ణయం తీసుకోవాలి. రాజకీయాలు నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేసుకోవాలి. నాకు కుటుంబం, పిల్లలు ఉన్నారు. వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా చూసుకోవాలి. అవన్నీ బేరీజు వేసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటా' అని బదులిచ్చారు. గంగూలీని ఒప్పించటంలో భాజపా గనక సఫలమైతే.. దీదీ వర్సెస్ దాదాగా బంగాల్ ఎన్నికలు మరింత రంజుగా మారతాయనటంలో సందేహం లేదు.
ఇవీ చదవండి: బంగాల్.. కశ్మీర్‌లా మారితే తప్పేంటి?: ఒమర్
'బంగారు బంగాల్' కల నెరవేరబోతోంది: మోదీ
బంగాల్ దంగల్: అస్థిత్వ పోరాటం- మతతత్వ రాజకీయం