Sonu Sood: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ పోలింగ్ బూత్‌ను పరిశీలించేందుకు ప్రయత్నించగా ఆయన్ను అడ్డుకున్నారు అధికారులు. కారును సీజ్ చేసి, తిరిగి ఇంటికి పంపించారు.
తన సోదరి మాళవిక సూద్ మోగా స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆదివారం పోలింగ్ జరుగుతున్న క్రమంలో నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు సోనూసూద్ ప్రయత్నించినట్లు జిల్లా పీఆర్ఓ ప్రద్భూదీప్ సింగ్ తెలిపారు. 'ఓ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు సోనూసూద్ ప్రయత్నించారు. ఆయన్ను అడ్డుకున్న అధికారులు కారును స్వాధీనం చేసుకుని తిరిగి ఇంటికి పంపించారు. తన ఇంటి నుంచి బయటకు వస్తే తగిన చర్యలు తీసుకుంటాం' అని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన సోనూసూద్.. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడటం తమ బాధ్యతగా పేర్కొన్నారు.
"విపక్షాలు, ముఖ్యంగా అకాలీ దళ్‌కు చెందిన వారి నుంచి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. కొన్ని కేంద్రాల్లో డబ్బులు పంచుతున్నారు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేయటం, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడటం మన బాధ్యత. అందుకోసమే ఇంటి నుంచి బయటకు వచ్చాము. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాం. "
- సోనూసూద్.
ఇదీ చూడండి: పెళ్లి దుస్తులతో ఓటేసేందుకు వధువు.. అధికారుల సాయంతో అవిభక్త కవలలు