ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను (Prashant Kishor) పార్టీలోకి ఆహ్వానించే విషయంపై కాంగ్రెస్(Congress Politics) తర్జనభర్జన పడుతోంది. దీనిపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) అంతిమంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకుగాను పార్టీలోని సీనియర్ నాయకులతో దీనిపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపారు. అయితే పీకే చేరికపై పార్టీలోని కొందరు నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన పార్టీలోకి వస్తే మంచే జరగుతుందని భావిస్తున్నారు.
అయితే దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అధిష్ఠానానికి లేఖ రాసిన పెద్దల్లో కొంతమంది పీకీ చేరికపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
పార్టీలో చేరికపై ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని(Rahul Gandhi) కలిశారు. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ విషయానికి సంబంధించి పార్టీలో కీలక పాత్రను చేపట్టడంపై కూడా చర్చించారు.
ప్రశాంత్ కిశోర్ 2014 లోక్‌సభ ఎన్నికలకు(Loksabha Election 2014) ముందు భాజపాతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత జేడీయూలో చేరారు. కొంతకాలం పాటు ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సలహాదారు పదవికి రాజీనామా చేశారు.
ఇదీ చూడండి: ఆ 'ఈవీఎంల'పై సుప్రీంకు ఈసీ.. వచ్చే వారం విచారణ