Sonia Gandhi ED case: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు సోనియా గాంధీ వాంగ్మూలం నమోదు చేశారు. రెండోవిడత విచారణలో భాగంగా మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఉదయం 11 గంటలకు... కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రియాంక అక్కడే ఉండగా రాహుల్ పార్లమెంటుకు వెళ్లిపోయారు. రెండున్నర గంటల పాటు సోనియాను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత భోజన విరామం ఇచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి సోనియా విచారణకు హాజరయ్యారు.
మొత్తంగా మంగళవారం 6 గంటల పాటు సోనియాను ఈడీ ప్రశ్నించింది. బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. రెండు రోజుల విచారణలో భాగంగా సోనియాను 55 ప్రశ్నలు అడిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీని అడిగినటువంటి ప్రశ్నలనే సోనియాను అడిగినట్లు పేర్కొన్నాయి. ఈనెల 21న ఈ కేసుకు సంబంధించి తొలిసారి సోనియాను ప్రశ్నించిన అధికారులు... గత శుక్రవారం మళ్లీ సమన్లు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. సోనియా విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆందోళనలో ఉద్రిక్తత..
సోనియాను ఈడీ ప్రశ్నించటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పార్లమెంటు నుంచి ర్యాలీగా బయలుదేరిన రాహుల్ సహా కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఉదయం పార్లమెంటులోని మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమైన కాంగ్రెస్ ఎంపీలు... రాజ్‌పథ్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా రాహుల్‌సహా కాంగ్రెస్ ఎంపీలు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం రాహుల్‌సహా కాంగ్రెస్ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
'ప్రజాస్వామ్య హత్యే'
రాజ్‌ఘాట్ వెలుపల సత్యాగ్రహదీక్షకు కేంద్రం అనుమతించకపోవటంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తప్పుపట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2005లో బాబారాందేవ్‌కు మద్దతుగా భారతీయ జనతా పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయాన్ని మాకెన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్షానికి కూడా నిరసన తెలిపేందుకు అనుమతించకపోవటం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటమేనని అజయ్ మాకెన్ అభిప్రాయపడ్డారు.
గతేడాది నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ అభియోగాలకు సంబంధించి సోనియా, రాహుల్‌పై కొత్తగా కేసు నమోదుచేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్... వారికి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో గత నెల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ను కూడా ఈడీ అధికారులు విచారణ చేశారు. ఐదు రోజులపాటు 50 గంటలు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: