దిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళన, ఇంధన ధరల పెరుగుదల వంటి అంశాలను కేంద్రం గాలికొదిలేసిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. మోదీ నిర్ణయాలతో దేశం నడిరోడ్డులో నిలబడాల్సి వచ్చిందని మండిపడ్డారు.
రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీపై ఆమె స్పందించారు. తీవ్రమైన చలిలో రైతులు చేస్తున్న పోరాటాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంధ, చెవిటి ప్రభుత్వానికి ఇవి కనపడవని సోనియా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె హిందీలో వరుస ట్వీట్లు చేశారు.
ఇన్నేళ్లలో ఏనాడూ..
దేశంలో ప్రస్తుత పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఏనాడూ లేవని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. మరోవైపు పెట్రోలు ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: రాహుల్ అంటే కేంద్రానికి వణుకు: శివసేన