తల్లిని దైవంలా చూసుకోవాల్సిన కొడుకే కాలయముడికంటే కర్కశంగా వ్యవహరించాడు. తల్లిని చంపి ఆమె శరీరానికి నిప్పంటించాడు. ఆ మంటపై కోడిని కాల్చుకొని తిన్నాడు. ఝార్ఖండ్, పశ్చిమ సింభూమ్ జిల్లాలోని అంతర్గర్ మనోహర్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
నిందితుడిని ప్రధాన్ సోయ్(35)గా గుర్తించారు పోలీసులు. నాలుగేళ్ల క్రితం తన తండ్రిని కూడా హత్య చేసి.. ఆ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు అతడు. ప్రధాన్ సోయ్‌కి మతిస్థిమితం సరిగా లేదని పలువురు చెబుతున్నారు. నిందితుడి వదిన సోమ్వరి సోయ్ ఇచ్చిన ఫిర్యాదుతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇలా జరిగింది...
శుక్రవారం ఇంటి పనులు ముగించుకున్న తర్వాత సోమ్‌వతి సోయ్, నిందితుడి తల్లి సుమి సోయ్ ఇద్దరు పడుకోవడానికి సిద్ధమయ్యారు. రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాన్ సోయ్ తప్పతాగి ఇంటికి వచ్చాడు. వచ్చీ రాగానే ఇద్దరిపై కర్రతో దాడి చేశాడు. దీంతో బెంబేలెత్తిపోయిన సోమ్‌వతి తన కొడుకుతో బయటకు పారిపోయింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత తన తల్లి సుమి సోయ్ని చనిపోయేంతగా చితకబాదాడు నిందితుడు. సుమి మరణించిన తర్వాత.. ఇంటి ఆవరణలోనే కర్రలు, పిడకలతో చితిని పేర్చాడు. దానిపై తల్లి శవాన్ని ఉంచి దహనం చేశాడు. కొంత సమయం తర్వాత ఆ మంటలపైనే కోడిని కాల్చుకున్నాడు. దాన్ని తినేసి పడుకోవడానికి వెళ్లాడు.
ఇంట్లోంచి పారిపోయిన సోమ్వరి కొద్దిసేపు తర్వాత పొరుగువారిని పిలుచుకొని వచ్చింది. వారిపైనా నిందితుడు దాడికి యత్నించాడు. చంపేందుకు ప్రయత్నాలు చేశాడు. వారు వెళ్లిపోయిన తర్వాత రాత్రంతా ఇంట్లోనే పడుకున్న నిందితుడు ప్రధాన్.. శనివారం ఉదయం మళ్లీ తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. సగం కాలిపోయిన తన తల్లి శవాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పొయ్యిలో పడేశాడు. ఉదయం ఆరున్నరకు ఇంటికి చేరుకున్న సోమ్‌వతి ఈ ఘటనను చూసి దిగ్భ్రాంతికి గురైంది. విషయం తెలుసుకున్న స్థానికులు ప్రధాన్‌ను వెంబడించి పట్టుకున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు.
అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలి శవం దాదాపుగా కాలిపోయినట్లు గుర్తించారు. నమూనాలను సేకరించి.. వాటిని పోస్ట్ మార్టం కోసం పంపించారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని మనోహర్‌పుర్ డీఎస్పీ విమలేశ్ కుమార్ త్రిపాఠి స్పష్టం చేశారు.