రెండు రోజుల వయసున్న కొడుకు కోసం.. భార్య తరఫు బంధువులపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశాడు ఓ వ్యక్తి. తన వాళ్లతో వచ్చి.. ఆసుపత్రి ముందే అత్తింటి వారిపై దాడికి తెగబడ్డాడు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముడ్కి ప్రాంతానికి చెందిన కిరణ్.. తన కూతురు కమల్‌జిత్ కౌర్‌ను నాకోదార్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. పెళ్లైనప్పటి నుంచే కమల్జిత్ను.. నాకోదార్ కుటుంబ సభ్యులు వేధిస్తుండేవారు. దీంతో ఆరునెలల క్రితం పుట్టింటికి వచ్చింది కమల్‌జిత్ కౌర్. అప్పటికే గర్భవతిగా ఉన్న ఆమె.. రెండు రోజుల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత చిన్నారి ఆరోగ్యం బాగాలేక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే, చిన్నారిని తనకు అప్పగించాలంటూ ఆసుపత్రి ముందు గందరగోళం సృష్టించాడు నాకోదార్. తన బంధువులతో కలిసి.. బాలుడ్ని అప్పగించాలంటూ కిరణ్ కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు. రాళ్లు, ఇటుకలతో దాడి చేశాడు. దీంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన నాకోదార్.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. నిందితులను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.
అప్పుడు పుట్టిన శిశువును చెత్తలో పడేసి కాల్చేసిన వైద్య సిబ్బంది..
ఝార్ఖండ్‌లోని గద్వా జిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పట్టిన శిశువును.. చెత్తలో వేసి నిప్పంటించారు ఏఎన్ఎమ్ కార్యకర్త, ఓ సహాయకురాలు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారి కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి ముందు ఆందోళనలకు దిగారు.
![new born baby burned by ANM worker and midwife](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/jh-pal-01-death-of-child-pkg-7203481_11062023013844_1106f_1686427724_929.jpg)
మంఝియాన్ ప్రాంతానికి చెందిన మధుదేవీ అనే మహిళ పురిటి నొప్పులతో స్థానిక ఆసుపత్రిలో చేరింది. అనంతరం గర్భంలోనే చనిపోయిన శిశువుకు జన్మనిచ్చింది. దీంతో చేసేదేమీ లేక చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. అందుకు ఏర్పాట్లు సైతం చేసుకున్నారు. అంతలోనే చిన్నారిని చెత్తలో వేసి నిప్పంటించారు ఆరోగ్య సిబ్బంది. దీంతో చిన్నారి మృతదేహం పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న చిన్నారి కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై వైద్యాధికారి స్పందించారు. చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాల్సి ఉంటుందని.. కానీ వారు అలా చేయలేదన్నారు. దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. చిన్నారిని మంటల్లో వేసిన విషయం తనకు తెలియదన్నారు ఏఎన్ఎమ్ కార్యకర్త. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.