డబ్బులు అడిగితే ఇవ్వలేదని తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపాడు ఓ కొడుకు. వారిద్దరు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి వెళ్లి సుత్తితో ముఖంతో పాటు పలుచోట్ల బలంగా గాయపరిచాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణం దిల్లీలోని ఫతేనగర్‌లో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. స్వర్ణ మల్హోత్రా అనే వ్యక్తి తన భార్యతో పాటు ఫతేనగర్‌లోని ఓ ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తున్నాడు. అదే ఇంట్లోని పైఫ్లోర్‌లో అతడి కొడుకు జస్దీప్ అలియాస్ సన్నీ సింగ్ తన భార్యతో ఉంటున్నాడు. స్టాక్ మార్కెట్లో 10 లక్షలు కోల్పోయిన సన్నీ ఆ డబ్బును ఇవ్వమని తల్లిదండ్రులను అడిగాడు. వారు అందుకు నిరాకరించారు. ఈ విషయంపై గత ఐదు రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో గురువారం తన తల్లిదండ్రులను హతమార్చాలనుకున్నాడు సన్నీ.
మొదట తల్లిదండ్రులు తింటున్న భోజనంలో విషపదార్థాన్ని కలిపాడు. అది తిని వారిద్దరు అపస్మారక స్థితికి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న కొడుకు వారిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సుత్తి, స్క్రూడ్రైవర్ లాంటి పదునైన ఆయుధాలతో ఇద్దరి ముఖాలపై దాడి చేశాడు.
సుమారు నాలుగు గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకి వచ్చి అదే ప్రాంతంలో ఉన్న కౌన్సిలర్ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఎవరో చొరబడ్డారని వారు తన తల్లిదండ్రులను హతమార్చారని కట్టుకథలు చెప్పాడు. దీంతో కౌన్సిలర్ పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న వృద్ధులను చూసి షాక్‌కు గురయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సన్నీ మీద అనుమానం కలిగింది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట్లో బుకాయించిన సన్నీ ఆ తర్వాత నేరాన్ని ఒప్పుకున్నాడు. బాధితుడి ముఖంపై పై దాదాపు 37 గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. జస్దీప్ భార్యను విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: పాక్ పడవలో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. విలువ రూ.350 కోట్లు పైనే!
లారీని ఢీకొట్టిన బస్సు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 14 మంది సజీవదహనం