పిల్లలు అడిగింది తెచ్చిచ్చే తల్లిదండ్రులు ఉంటారు. చిన్న బొమ్మ అడిగితే.. పెద్దది ఇస్తారు. కానీ, కేరళ మలప్పురమ్‌కు చెందిన ఓ తండ్రి.. కొడుకు బొమ్మ జీపు అడిగితే ఏకంగా నిజమైన జీపునే తయారు చేసిచ్చాడు. ఆ తండ్రీకొడుకుల జీపు కథేంటో ఓసారి తెలుసుకుందామా?
కేరళ మలప్పురమ్ జిల్లా ఉరాంగట్టిరి గ్రామానికి చెందిన షకీర్.. ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి 6 సంవత్సరాల క్రితం స్వస్థలానికి తిరిగివచ్చాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు బొమ్మ జీపు అడగగా.. ఏకంగా నిజమైన మినీ జీపును తయారు చేసి ఇచ్చాడు. అయితే.. ప్రస్తుతం ఈ జీపు విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కతార్‌లో పని చేస్తున్న సమయంలో అక్కడి ఇళ్లల్లో ఇలాంటి బొమ్మ వాహనాలు చూశానని, అలాంటిది తన కుమారుడికి తయారు చేయాలని అప్పుడే నిశ్చయించుకున్నట్లు తెలిపాడు షకీర్. స్వగ్రామం వచ్చాక.. జీపు తయారు చేసేందుకు కావాల్సిన సామగ్రి కోసం దిల్లీ సహా ఇతర నగరాలు తిరిగినట్లు చెప్పాడు. ఇతర పనులు చేసుకుంటూనే.. జీపు తయారు చేయటం వల్ల ఏడాది సమయం పట్టిందని, కానీ, మూడు నెలల్లోనే పూర్తి చేయొచ్చని తెలిపాడు.
బైక్ ఇంజిన్‌తో..
జీపు తయారీ కోసం పాత బజాబ్ బైక్ ఇంజిన్ వినియోగించారు. జీపు కోసం మొత్తం రూ.1.70 లక్షలు వెచ్చించారు. ఒక లీటర్ పెట్రోల్‌తో 35 కిలోమీటర్లు, మంచి రోడ్డుపై ప్రయాణిస్తే.. 40 కిలోమీటర్ల వరకూ మైలేజీ వస్తుందని షకీర్ తెలిపాడు. అయితే.. తన ఇంటి నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఆ జీపును కొట్టక్కల్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.2 లక్షలకు విక్రయించాల్సి వచ్చిందని తెలిపాడు.
చాలా మంది తమకు అలాంటి మినీ జీపు తయారు చేసి ఇవ్వాలని షకీర్‌ను కోరుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ అవసరం లేకుండా నడిచే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నిమగ్నమయ్యాడు షకీర్.
ఇదీ చూడండి: 'స్నేహమోల్'.. ఆటో లాంటిది కానీ ఆటో కాదు!