నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైన.. ఓ 85 ఏళ్ల వృద్ధురాలి కోరికను తీర్చారు ఆమె కొడుకు, కోడలు. తాజ్ మహల్ చూడాలనే వృద్ధురాలి చిరకాల వాంఛను నెరవేర్చారు. స్ట్రెచర్‌పై ఆమెను తీసుకువచ్చి తాజ్‌మహల్ మొత్తాన్ని తిప్పి చూపించారు. గుజరాత్‌కు చెందిన మహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి.. తన భార్యతో కలిసి, తల్లి రజియా కోరికను ఈ విధంగా నెరవేర్చాడు. సోమవారం వీరంతా కలిసి ఆగ్రాను సందర్శించారు.
మహమ్మద్ ఇబ్రహీం కుటుంబం గుజరాచ్ కచ్ జిల్లాలోని ముంద్రా ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇబ్రహీం తల్లి రజియా.. 32 సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయింది. చాలా ఏళ్లుగా రజియాకు తాజ్‌మహల్ చూడాలనే కోరిక ఉంది. ఆ కోరికను కొడుకుకు తెలియజేసింది. దీంతో తల్లి కోరికను ఎలగైనా తీర్చాలని ఇబ్రహీం నిర్ణయించుకున్నాడు. తల్లిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి.. భార్యతో కలిసి ఆగ్రాను సందర్శించాడు.
"మా పూర్వీకుల్లో ఒకరు అప్పట్లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసేవారు. ఆయనకు అప్పటి పరిపాలకుడైన జహంగీర్ మరణ శిక్షను విధించాడు. ఆయన సమాధి కూడా ఆగ్రాలోనే ఉంది. ముందుగా మేమంతా కలిసి ఆయన సమాధి వద్దకు వెళ్లాం. అనంతరం ఆయన సమాధికి నివాళులు అర్పించాం. ఆ తర్వాత తాజ్‌మహల్ చూసేందుకు బయలుదేరాం" అని మహమ్మద్ ఇబ్రహీం తెలిపారు. ఇప్పుడు తన తల్లి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఇబ్రహీం తెలిపారు. తన తల్లి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇబ్రహీంకు ప్రశంసలు..
మహమ్మద్ ఇబ్రహీం చేసిన ఈ మంచి పనికి పలువురి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. స్ట్రెచర్‌పై తల్లిని తీసుకుని తాజ్ మహల్‌కు వచ్చిన ఇబ్రహీంను చూసి.. మిగతా సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అతడిని అభినందించారు. స్ట్రెచర్‌పై తల్లిని తీసుకుని వచ్చి తాజ్‌మహల్ చూపిస్తున్న.. ఇబ్రహీం వీడియో, సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా కూడా ఇబ్రహీంను చాలా మంది అభినందిస్తున్నారు.
56 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరిన మహిళ.. కన్నతల్లి కోరిక నెరవేర్చిన తనయుడు..
ఇటీవల ఇదే తరహా ఘటన ఒకటి జరిగింది. ఓ వృద్ధురాలి కోరికను నెరవేర్చాడు కొడుకు. 56 ఏళ్ల తర్వాత ఆమెను.. తన పుట్టింటికి చేర్చాడు. కొన్నేళ్ల తల్లి నిరీక్షణకు తెరదించాడు. తన పుట్టింటి వారిని చూసిన ఆ వృద్ధురాలి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమెను చూసిన పుట్టింటి వారు ఎలా స్వాగతించారు, తరవాత ఏవిధంగా వారు స్పందించారో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.