Snakes are Saviours : పోలీసులను సమాజానికి రక్షణగా భావిస్తుంటారు ప్రజలు. అయితే.. మరి ఆ పోలీసులకు రక్ష ఎవరు? పాములు. వినడానికి వింతగా ఉన్న మీరు విన్నది నిజమే. కేరళలోని పోలీసులకు అవే రక్షణ కల్పిస్తున్నాయి మరి. విషపూరితమైన పాములు మనుషులకు రక్షణ కల్పించడమేంటి అనిపిస్తుందా? అవి నిజమైన పాములు కాదు లెండి.. అసలు కథేంటంటే..
కేరళ- తమిళనాడు సరిహద్దులోని ఇడుక్కి అటవీప్రాంతంలో కుంబుమ్మెట్టు పోలీస్ స్టేషన్ ఉంది. అడవిలో నుంచి తరచుగా వానరాలు గుంపులుగుంపులుగా స్టేషన్‌లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుండేవి. దీంతో.. పోలీసు సిబ్బంది సరిగా విధులు నిర్వర్తించలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలియక తలలు పట్టుకునేవారు.
ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా నివసించే ఓ రైతు వారికి ఓ సలహా ఇచ్చారు. పంటపొలాల్లోకి కోతులు చొరబడకుండా తాను పాము బొమ్మలు ఏర్పాటు చేసుకున్నానని, వాటిని చూసి వానరాలు బెదిరిపోతున్నాయని చెప్పారు. దీంతో పోలీసులు కూడా చైనా సంస్థ తయారు చేసిన రబ్బరు పాము బొమ్మలను కొనుగోలు చేశారు. వాటిని స్టేషన్ ప్రాంగణంలోనూ, చెట్లపైనా ఏర్పాటు చేశారు. చూడ్డానికి నిజమైన పాముల్లాగే ఉన్న ఆ బొమ్మలతో తమ బాధలు తప్పాయని, కోతుల బెడద తగ్గిందని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


పోలీసులకు సలహా ఇచ్చిన ఆ రైతు పేరు బిజు. ఇడుక్కి సమీపంలోని ఉడుంబంచోళ గ్రామంలో యాలకులు సాగు చేసేవాడు. కోతులు తన పంటను ధ్వంసం చేస్తుండటం చూసిన అతనికి ఒకరోజు మంచి ఆలోచన తట్టింది. తోటలో చనిపోయిన పాములను చూసి కోతులు దూరంగా వెళ్లడం చూశాడు. దీంతో ఆన్లైన్లో రబ్బరు పాములను కొనుగోలు చేసి తన పొలంలో అక్కడక్కడా చెట్లకు వేలాడదీశాడు. ఇది విజయవంతమైంది. గాలికి పాము బొమ్మలు ఊగుతూ.. కోతులు అటు వంక రావడం తగ్గింది.


ఇవీ చూడండి : యువకుడ్ని వెంటాడుతున్న పాము.. 10 రోజుల్లో 5 కాట్లు.. ప్రతిసారీ అక్కడే..
'సైరాట్' నటుడిపై చీటింగ్ కేసు.. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం!