Smallest Polling Booth : ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ చాలా విలువైనది. అందుకే ఎన్నికల్లో ఓటు వేసేలా ఓటర్లను ప్రభుత్వం చైతన్య పరుస్తుంది. త్వరలో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఒకటైన ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో (నవంబర్ 7, 17న) పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే అక్కడి ఓ పోలింగ్ కేంద్రం వార్తల్లో నిలుస్తోంది.
అందుకు కారణమేంటంటే?.. అక్కడ కేవలం అయిదుగురు ఓటర్లు మాత్రమే ఉండటం. ఛత్తీస్‌గఢ్‌లోనే అతిచిన్న పోలింగ్ కేంద్రంగా ఇది గుర్తింపు పొందింది. దేశంలోని అతిచిన్న పోలింగ్ కేంద్రాల్లో ఇదీ ఒకటనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పోలింగ్ కేంద్రం గురించి తెలుసుకుందాం.
దట్టమైన అడవుల మధ్య..
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ నియోజకవర్గమైన భరత్‌పుర్ సోన్‌హత్‌లోని శేరాడాండ్ గ్రామంలో ఈ పోలింగ్ కేంద్రం ఉంది. ఇది చందా గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామం. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ గ్రామంలో కేవలం 3 ఓట్లే ఉన్నాయి. ఈ మూడు ఇళ్లలో 11 మంది నివాసం ఉంటున్నారు. ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు.. మొత్తం అయిదుగురికి ఓటుహక్కు ఉంది. వీరిలో ఓ జంట తొలిసారిగా ఇక్కడ ఓటు వేయనుంది.
గుడిసెలో పోలింగ్ కేంద్రాన్ని..
Five Voters In Chhattisgarh Village : 2008లో ఇక్కడ కేవలం ఇద్దరే ఓటర్లు ఉండగా.. గుడిసెలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు శాశ్వత భవనాన్ని నిర్మించడం గమనార్హం.పోలింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల అధికారులు రెండు రోజుల ముందే అక్కడికి చేరుకుంటారు. ప్రతిసారి అక్కడ 100 శాతం ఓటింగ్ నమోదవుతుందట. ఇదిలా ఉండగా.. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంటోలో 12 మంది, రేవాలాలో 23 మంది ఓటర్లు ఉన్నారు.
కాంగ్రెస్ X బీజేపీ
Chhattisgarh Assembly Election 2023 : 90 శాసనసభ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సంక్షేమ పథకాలతోపాటు ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ ఛరిష్మాతో తిరిగి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌పై అవినీతి సంబంధిత ఆరోపణలు గుప్పిస్తూ కమలదళం దూకుడు కనపరుస్తోంది. ఇరుపార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాడు. పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలియాలంటే డిసెంబరు 3 వరకు వేచిచూడాల్సిందే.