భవనం పైఅంతస్తుల్లో పేలుడు సంభవించటం వల్ల స్లాబు మధ్యలో కూలిపోయి.. కింది అంతస్తులో పడిపోవటం.. ఆపై అది కూడా కూలిపోయి దాని కింద ఉన్న మరో అంతస్తులోకి రావటం.. బిల్డింగ్ మధ్యలో పెద్ద రంధ్రం ఏర్పడటం వంటి సంఘటనలు పలు సినిమాల్లో చూసే ఉంటారు. కానీ.. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ఐదో అంతస్తు నుంచి మొదలుకొని చివరి వరకు స్లాబులు వరుసబెట్టి ఒకదాని తర్వాత ఒకటి కూలిపోయాయి. భవనం చుట్టూ భాగానే కనిపిస్తున్నా.. మధ్యలో పెద్ద రంధ్రం ఏర్పడింది.
నవీ ముంబయిలోని నేరుల్ ప్రాంతం సెక్టార్ 19లో ఉన్న జిమ్మి పార్క్ భవనంలో ఈ స్లాబులు కూలిపోయాయి. ఐదంతస్తుల్లో మధ్యలో స్లాబులు కూలిపోవటం వల్ల అపార్ట్మెంట్లోని జనం భయంతో వణికిపోయారు. భవనం కూలిపోతుందని పరుగులు పెట్టారు. ఆ భవనంలో భయానక పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. శిథిలాల్లో చిక్కుకున్న పలువురుని రక్షించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
సమాచారం అందుకున్న బేలాపుర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మందా మ్హాత్రే, పోలీస్ కమిషనర్ అభిజీత్ బాంగర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అన్ని విధాల సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకుంటామని భరోసా కల్పించారు.
ఇదీ చూడండి: బాయ్‌ఫ్రెండ్ కోసం పెద్ద రిస్క్.. ఐఏఎస్ ఆశలు ఆవిరి.. మూడో అంతస్తు నుంచి పడి..
మ్యాచ్ మధ్యలో అలా కెమెరాలకు చిక్కిన యువతి.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ