కర్ణాటకలోని బెంగళూరులో ఘోరం జరిగింది. ఆరుగురు కలిసి ఓ యువకుడిని రాయితో కొట్టి చంపారు. నిందితుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మృతుడిని బాదామికి చెందిన బాలప్ప జమఖండిగా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కేపీ అగ్రహారలోని ఓ మెడికల్ షాపులో బాధితుడు తన మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టాడు. అంతలో అక్కడికి ఆరుగురు వ్యక్తులు వచ్చారు. బాలప్పతో గొడవకు దిగారు. అనంతరం అక్కడ ఉన్న రాయితో 20 సార్లు బాలప్ప తలపై కొట్టి హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితులు బాదామికి చెందినవారని పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
కన్నకొడుకునే సుపారీ ఇచ్చి..
కర్ణాటక హుబ్లీలో దారుణం జరిగింది. కన్నకొడుకునే సుపారీ ఇచ్చి హత్య చేయించాడు ఓ తండ్రి. మృతుడిని అఖిల్ జైన్(30)గా గుర్తించారు పోలీసులు.
అఖిల్ జైన్ కొద్ది రోజుల నుంచి కనిపించట్లేదని అతడి తండ్రి అయిన వ్యాపారవేత్త భరత్ జైన్.. కేశ్వాపుర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అఖిల్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడని తేలింది. ఈ క్రమంలో అతడిపై కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్ లిస్ట్‌ను పరిశీలించగా పోలీసులకు మరింత సమాచారం లభించింది. అఖిల్ తండ్రి భరత్ జైన్.. కొందరు రౌడీలతో ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. భరత్ జైన్‌ను పోలీసులు విచారించగా.. తానే సుపారి ఇచ్చి అఖిల్‌ను హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు.
పొలంలో మృతదేహం..
ఝార్ఖండ్.. ధన్బాద్లో యువకుడి మృతదేహం పొలంలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని బిహార్‌కు చెందిన జితేంద్ర (40)గా పోలీసులు గుర్తించారు. జితేంద్ర.. డ్రైవర్‌గా పనిచేసేవాడని అతని సోదరుడు సత్యేంద్ర సింగ్ తెలిపాడు. మృతుడు మద్యానికి బానిసయ్యాడని.. అందువల్లే మరణించి ఉండవచ్చని పోలీసులకు తెలిపాడు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
మృతదేహాన్ని పీక్కుతింటున్న కుక్కలు..
ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లో అమానవీయ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం స్థానికంగా కలకలం రేపింది. అలాగే మృతదేహం మీదుగా పలు వాహనాలు వెళ్లడం వల్ల నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి జరిగిందీ ఘటన.