Surat gas leak: గుజరాత్ సూరత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ కంపెనీలో కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువు లీకై ఆరుగురు మరణించారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో గురువారం వేకువజామున ఈ ఘటన జరిగింది.
సచిన్ జీఐడీసీ ప్రాంతంలో రోడ్డుపక్కన పార్కు చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్ పైపు లీకై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషవాయువు వ్యాపించిన క్షణాల్లోనే సమీపంలోని విశ్వప్రేమ్ మిల్లో పని చేసే కార్మికులు సృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ కార్మికులంతా కెమికల్ ట్యాంకర్‌కు 8-10 మీటర్ల దూరంలో నిద్రిస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు.
ట్యాంకర్లో గ్యాస్ లీకైన వెంటనే మిల్లులో ఉన్న వారంతా ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారని విశ్వప్రేమ్ మిల్స్ ప్రొడక్షన్ మేనేజర్ వెల్లడించారు. కార్మికులు సృహ కోల్పోయి నేలపై పడిపోయారని చెప్పారు.
ఉదయం 5 గంటల సమయంలో గ్యాస్ లీకై పలువురు సృహకోల్పోయినట్లు తమకు సమాచారం అందిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వెంటనే అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 20మంది కార్మికులను అంబులెన్సులో చికిత్స కోసం తీసుకువచ్చారని, వారిలో ఆగుగురు మరణించారని వివరించారు. మిగతావారికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.