తమని తాము సిక్స్‌ప్యాక్‌లో చూసుకోవాలనీ ఫొటోల్లో అలా పోజ్ కొట్టి సోషల్ మీడియాలో స్నేహితులకు షేర్ చెయ్యాలనీ చాలామంది అబ్బాయిలు కలలు కంటుంటారు. కానీ దానికి రోజూ చాలా సమయం వ్యాయామం చెయ్యాలి. ఏది పడితే అది తినకుండా ఆహార నియమాలను పాటించాలి. కాబట్టి సిక్స్‌ప్యాక్ ఎంతోమందికి కలలానే మిగిలిపోతోంది. అయితే, కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఈ 'సూపర్ రియలిస్టిక్ మజిల్ సూట్' చిటికెలో ఆ కోరికను తీర్చేస్తోంది. కండలు తిరిగినట్లు రూపొందించిన ఈ సిలికాన్ తొడుగు అచ్చం మన శరీరంలానే కనిపిస్తుంది. కాబట్టి, దీన్ని వేసుకుంటే సిక్స్‌ప్యాక్స్ ఉన్నట్లే ఉంటుంది మరి. ఆన్‌లైన్ షాపుల్లో దొరుకుతున్నాయివి.
లిప్‌స్టిక్... క్రెడిట్ కార్డులా...
పెదవులు ఎర్రగా, గులాబీ రంగులో మెరుస్తుంటే ఆ అందమే వేరు. అందుకే, ఈతరం అమ్మాయిల హ్యాండ్ బ్యాగులో ఏమున్నా లేకపోయినా లిప్‌స్టిక్ మాత్రం ఎప్పుడూ ఉండాల్సిందే. కాకపోతే, బయటికెళ్లిన ప్రతిసారీ హ్యాండ్‌బ్యాగే తీసుకెళ్లం. వేసుకున్న దుస్తులకు తగ్గట్లు ఫ్యాషన్‌గా ఉండేందుకు కొన్నిసార్లు, పర్సులూ క్లచ్... లాంటి వాటినీ తగిలించుకుంటాం. వాటిలోనేమో మామూలు లిప్‌స్టిక్‌లు పట్టవు. ఈ సమస్యకు పరిష్కారంగానే చైనాకు చెందిన డిజైనర్ 'యురు జంగ్' క్రెడిట్ కార్డుని పోలిన లిప్‌స్టిక్‌ని తయారుచేశాడు. ఇలాంటివాటినైతే నాలుగైదు రంగుల లిప్‌స్టిక్‌లనైనా మామూలు కార్డుల్లానే వెంట తీసుకెళ్లొచ్చు. కావల్సినప్పుడు ఫొటోలో చూపినట్లు పెదవులకు రాసేయొచ్చు. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందట.
సాస్ పోస్తే బొమ్మ కనిపిస్తుంది!
కొందరికి గిన్నెలూ గ్లాసులు కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఇక, ఇంటికెవరైనా అతిథులు వచ్చినప్పుడైతే మరింత ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటారు. అలాంటివారికోసం వస్తున్నవే ఈ 'రీడెస్టు సాస్ ప్లేట్లు'. తెల్లగా ఉండే ఈ పింగాణీ ప్లేట్ల అడుగుభాగంలో త్రీడీ ప్రింటింగ్‌తో వేసిన రకరకాల ఆకారాలు ఉంటాయి. గిన్నె ఖాళీగా ఉన్నప్పుడు ఇవి కనిపించవు. కానీ సమోసాలూ పిజ్జాలాంటివి తినేందుకు అందులో పలుచని సాస్ పోసినప్పుడు ఆ రూపాలు ఎంతో అందంగా కనిపిస్తూ చూసినవారిని అవాక్కయ్యేలా చేస్తాయి.
కటింగ్ బోర్డుని చుట్టేయొచ్చు!
ఏ వస్తువైనా ఇప్పుడున్న దానికన్నా మరింత సౌకర్యంగా ఉంటే దానివైపే మొగ్గు చూపుతాం. ఈ 'ట్రెబాన్ రోల్' కటింగ్ బోర్డు కూడా అలాంటిదే. మామూలుగా కటింగ్ బోర్డులు పలుచగానే ఉన్నా ఎక్కువ వెడల్పుతో ఉంటాయి. దాంతో ఎక్కడ పడితే అక్కడ ఇమడవు. కానీ ఈ రోల్ బోర్డుని పనైపోయాక ఎంచక్కా చుట్టేసి, ఊడకుండా దాని రెండు అంచులకున్న అయస్కాంత క్లిప్‌ని పెట్టేయొచ్చు. అలా దీన్ని ఎక్కడైనా చక్కగా సర్దేసుకోవచ్చు. ఈ బోర్డుని మధ్యకు మడిచే వీలు కూడా ఉంటుంది కాబట్టి, కూరగాయ ముక్కల్ని కూడా గిన్నెలోకి సులభంగా వెయ్యొచ్చు.
ఇదీ చూడండి: మన మాటలు 'స్మార్ట్‌ఫోన్' నిజంగా వింటోందా?