TSPSC Paper Leak Case : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడి ప్రవీణ్ మొబైల్‌ఫోన్ కీలకంగా మారింది. పోలీసు కస్టడీలో నోరుమెదపని అతని గుట్టంతా ఆ ఫోన్ నుంచి సేకరించిన సమాచారంతో బట్టబయలు చేశారు. అదనపు ఎస్పీ హోదాలో తండ్రి మరణించడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. ఏడాది క్రితమే పదోన్నతిపై కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా చేరాడు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు కార్యాలయానికి వచ్చినప్పుడు మాట కలిపేవాడు. చనువుగా ఉన్న మహిళల ఫోన్‌నెంబర్లు సేకరించి వాట్సాఫ్‌కాల్, ఛాటింగ్‌తో దగ్గరయ్యేవాడు. అవతలి వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని లోబచరుకునేందుకు ప్రయత్నించాడు. ప్రవీణ్ ఫోన్‌లో పలువురి మహిళల నగ్న, అర్ధనగ్న వీడియోలు, ఫొటోలున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
SIT Inquiry in TSPSC Paper Leak Case : గత ఏడాది నుంచి అతడు చేసిన ఫోన్ కాల్స్, ఛాటింగ్స్‌ను పోలీసులు రిట్రీవ్ చేసినట్లు తెలుస్తోంది. వాటిలో గ్రూప్ 1, ఏఈ, ఏఈఈ, డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ తదితర పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫోన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రవీణ్ కాల్‌డేటాలో ఉన్నవారి ఫోన్ నెంబర్లు గుర్తించి సంబంధిత అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నారు. వారి బ్యాంకు ఖాతా, ఫోన్‌నెంబర్లను తనిఖీ చేసి నిర్దారణైతే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసు నగర్ సిట్ పోలీసులకు బదిలీ అయ్యాక.. సుమారు 10 నుంచి 15 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి సమయం నిందితులను గుర్తించేందుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకూ 24 మందిని అరెస్టు చేశారు. సోమవారం అరెస్టు అయిన ముగ్గురి నిందితుల నుంచి ఏఈ, ఏఈఈ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థుల కోసం సిట్ పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఎవరైనా ఈ వ్యవహారంలో ఉన్నారా అనే కోణంలో గాలిస్తున్నారు.
నిందితురాలు రేణుకకు బెయిల్ మంజూరు: మరోవైపు నాంపల్లి కోర్టు బుధవారం ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితురాలు రేణుకా రాథోడ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని.. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని, పాస్‌పోర్టు సమర్పించాలని ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ కేసులో రేణుకా రాథోడ్(ఏ3), ఆమె భర్త డాక్యానాయక్(ఏ4) నిందితులుగా ఉన్నారు. రేణుక అనారోగ్యం, మహిళ కావడం, దర్యాప్తు అంతిమ దశలో ఉందన్న కారణాలపై బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది గుమ్మకొండ శ్రీనివాసరావు తాజాగా న్యాయస్థానానికి విన్నవించారు. దీంతో ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో డి.రమేశ్‌కుమార్(ఏ12), టి.రాజేందర్(ఏ14)లకు సైతం బెయిల్ ఇచ్చింది.
ఇవీ చదవండి: