Kejriwal Sisodia Bharat Ratna: దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను సౌకర్యాలను మెరుగుపరిచిన ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా.. భారతరత్న పురస్కారానికి అర్హుడని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కొనియాడారు. కానీ రాజకీయ కారణాలతో సిసోదియాను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఆయన ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్.. దిల్లీ విద్యా నమూనాను న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు.
70 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ చేయలేని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి అద్భుతం సృష్టించిన వ్యక్తిపై సీబీఐ దాడులు సిగ్గుచేటు కాదా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తిపై ఇలాండి దాడులు ఏంటని నిలదీశారు. మనీశ్ సిసోదియాను అరెస్ట్ చేయవచ్చని, తనను కూడా అరెస్ట్ చేయవచ్చన్న కేజ్రీవాల్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో ఆప్ అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
సిసోదియా సంచలన ట్వీట్!
మరోవైపు, కేజ్రీవాల్ సర్కార్ తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ వ్యవహారం దిల్లీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆప్‌ను వీడి భాజపాలో చేరితే తనపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేస్తామని భాజపా నుంచి ఆఫర్ వచ్చిందంటూ ఈ ఉదయం సంచలన వ్యాఖ్యలు చేసిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా.. తాజాగా మరో సంచలన ట్వీట్ చేశారు. ఆప్‌ను చీల్చితే తనకు సీఎం పదవి ఇస్తామని భాజపా ఆఫర్ చేసిందని పేర్కొన్నారు.
తనను సీఎంను చేస్తామన్న ప్రతిపాదనకు తన సమాధానం ఇదీ అని పేర్కొన్న సిసోదియా.. కేజ్రీవాల్ తనకు రాజకీయ గురువు అని.. ఆయనకు తాను ఎప్పటికీ ద్రోహం చేయనన్నారు. తాను ముఖ్యమంత్రి కావడం కోసం రాలేదని.. దేశంలోని ప్రతి చిన్నారి బాగా చదువుకోవాలనేదే తన కల అని ట్వీట్ చేశారు. అప్పుడే భారతదేశం నంబర్ 1గా మారగలదని.. దేశంలో కేజ్రీవాల్ మాత్రమే ఈ పనిచేయగలరంటూ ట్వీట్ చేశారు.
సీబీఐ దాడులు మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికేనా?
సిసోదియా చేసిన ట్వీట్‌పై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. శుక్రవారం సిసోదియా ఇంట్లో జరిగిన సీబీఐ దాడులపై అనుమానం వ్యక్తం చేస్తూ భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఇటీవల సిసోదియా ఇంట్లో సీబీఐ, ఈడీ దాడులతో మద్యం పాలసీ, అవినీతికి సంబంధంలేదన్నమాట. దిల్లీలో ఆప్ సర్కార్‌నిని పడగొట్టడానికే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఈ దాడులు చేశారా?" అని ట్విట్టర్లో ప్రశ్నించారు.
దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దానిలో భాగంగా సిసోదియా నివాసంతో పాటు దేశవ్యాప్తంగా 31 ప్రదేశాల్లో సీబీఐ దాడులు చేపట్టింది. కాగా దిల్లీ ఉపముఖ్యమంత్రి నివాసంపై సోదాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆప్ యత్నిస్తోంది. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉందని, అందుకే ప్రచారంలో ఈ తనిఖీల గురించి ప్రముఖంగా ప్రస్తావించాలని చూస్తున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చదవండి: వచ్చే నెలలో నౌకాదళంలోకి ఐఏసీ విక్రాంత్, ప్రత్యేకతలు ఇవే
రాంగ్ రూట్లో వచ్చి స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, నలుగురు విద్యార్థులు మృతి