Sikkim Flash Floods : భారీ వర్షాల కారణంగా సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర సిక్కింలోని లోనక్ లేక్ ప్రాంతంలో కురిసిన వర్షాల ధాటికి తీస్తా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి లాచెన్ వ్యాలీలో ఉన్న సైనిక స్థావరాలు ప్రభావితమయ్యాయని రక్షణ శాఖ గువాహటి కార్యాలయం వెల్లడించింది. 23 మంది సిబ్బంది గల్లంతయ్యారని తెలిపింది. కొన్ని సైనిక వాహనాలు సైతం వరద నీటిలో మునిగిపోయాయని వెల్లడించింది. కనిపించకుండా పోయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది.
ఆకాశానికి గండిపడినట్లు కురిసిన కుండపోత వర్షానికి వాగులు, వంకలు, సరస్సులు పోటెత్తాయి. సమీపంలోని చుంగ్ తాంగ్ డ్యాంలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరడం వల్ల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టుప్రాంతాల్లో వరద ప్రవాహం 15 నుంచి 20 అడుగల మేర పెరిగింది. ఇక తీస్తా నది ఉగ్రరూపం దాల్చడం వల్ల సింగ్తమ్ పాదాచారుల వంతెన కుప్పకూలింది. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్లే దిగువ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని రక్షణ శాఖ కార్యాలయం పేర్కొంది. సింగ్తమ్ సమీపంలోని బర్దంగ్ ప్రాంతంలో తమ ఆర్మీ వాహనాలు పార్క్ చేశామని, వరద ధాటికి అవి ప్రభావితమయ్యాయని వివరించింది. 41 సైనిక వాహనాలు మునిగిపోయాయని స్పష్టం చేసింది.
మరోవైపు, బంగాల్, సిక్కిం రాష్ట్రాలను కలిపే పదో నెంబర్ జాతీయ రహదారి అనేక ప్రాంతాల్లో కొట్టుకుపోయింది. మెరుపు వరదలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు నీటమునిగాయి. వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ స్పందించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి.. అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అటు తీస్తా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
దీదీ విచారం
కాగా, 23 మంది సైనికులు కనిపించకుండా పోవడంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం సాయం అందించేందుకు తమ రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉత్తర బంగాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చీఫ్ సెక్రెటరీని ఆదేశించినట్లు వివరించారు. 'కలింపోంగ్, డార్జీలింగ్, జల్పాయ్గుడి జిల్లాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించా. విపత్తు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సీనియర్ మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులను ఉత్తర బంగాల్‌కు పంపించా' అని దీదీ ట్వీట్ చేశారు.
Uttarakhand Floods : భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ గజగజ.. పేకమేడలా కూలిన డిఫెన్స్ కాలేజీ