వ్యాక్సిన్ తయారీలో అవసరమయ్యే ముడి పదార్థాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలంటే నిషేధం ఎత్తివేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభవృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను భారత్‌లో ఎస్‌ఐఐ ఉత్పత్తి చేస్తోంది. దేశీయ అవసరాలతో పాటు ఇతర దేశాలకూ సీరం టీకాల్ని ఎగుమతి చేస్తోంది.
ఇదీ చదవండి: 2 లక్షల 50 వేల టీకాలకు నిధులిస్తాం: గూగుల్
"ముడి పదార్థాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుణ్ని కోరుతున్నాను. ఫలితంగా.. టీకా ఉత్పత్తిని వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు మీ పాలకవర్గం దగ్గర ఉన్నాయి. కరోనాను అంతం చేయడంలో మనమంతా కలిసి ముందుకు సాగాలంటే నిషేధం ఎత్తివేయక తప్పదు" అంటూ పూనావాలా ట్వీట్ చేశారు. ఈ సందేశానికి అమెరికా అధ్యక్షుడి ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు.
ముడి పదార్థాల సమస్యను పూనావాలా.. గత నెలలో జరిగిన ఓ సమావేశంలోనే ప్రస్తావించారు. అమెరికాలో 'రక్షణ చట్టం' అమల్లో ఉన్నందున ఆ దేశంలో టీకాల తయారీకి కావాల్సిన కొన్ని ముడిపదార్థాలపై నిషేధం కొనసాగుతోంది. దీంతో అది ఇక్కడ టీకా తయారీకి పెద్ద అడ్డంకిగా మారింది.
ఇదీ చదవండి: ఓఎల్ఎక్స్లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు