SI looted 1crore rupees From Businessman : సమాజంలో జరిగే అన్యాయాలను అరికట్టాల్సిన పోలీసులే దోపిడీకి పాల్పడ్డారు. కంచె చేను మేసినట్లుగా వ్యవహరించి.. ఓ వ్యాపారవేత్త నుంచి దాదాపు కోటి రూపాయలను దోచుకున్నారు పోలీసులు. ఓ కారులో తనిఖీలు చేపట్టగా.. అందులో డబ్బులను గుర్తించారు. అనంతరం ఆ వ్యాపారవేత్తను బెదిరించి.. ఆ మొత్తం సొమ్ముతో హుడాయించారు. శుక్రవారం పంజాబ్‌లో ఘటన జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చండీగఢ్‌లోని సెక్టార్-39 పోలీస్ స్టేషన్ అదనపు సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ ఫోగట్‌గా ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వీరితో పాటు వీరేంద్ర, శివకుమార్ అనే కానిస్టేబుళ్లు కూడా ఈ చోరీకి సాయం అందిచారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరి నుంచి రూ.75 లక్షలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
దోపిడీ అంశం బయటకు రాకుండా ఉండేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. విషయం చండీగఢ్ ఎస్ఎస్పీ దాకా వెళ్లడం వల్ల ఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు నవీన్ ఫోగట్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది. మరికొంత మంది పోలీసుల హస్తం కూడా ఈ దోపిడీలో ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ చరణ్‌జిత్ సింగ్ ఘటనపై విచారణ చేస్తున్నారు.
ఇదీ జరిగింది..
ఆగష్టు 4న బఠిండాకు చెందిన వ్యాపారవేత్త సంజయ్ గోయల్.. కోటి రూపాయల విలువైన రూ.2వేల కరెన్సీ నోట్లను 500 రూపాయల నోట్లుగా మార్చుకుని మొహాలికి చేరుకున్నాడు. అనంతరం సెక్టార్-40లో గిల్ అనే వ్యక్తిని కలిశాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ నవీన్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు.. సంజయ్ కారును తనిఖీ చేశారు. అందులో కోటి రూపాయలను గుర్తించారు. ఆ మొత్తాన్ని సంజయ్‌ను బెదిరించి వారే లాగేసుకున్నారు.
పోలీసులకు భయపడ్డ సంజయ్.. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. మొత్తం విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అనంతరం చండీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు చండీగఢ్ ఎస్ఎస్పీ. అనంతరం వ్యాపారవేత్త నుంచి డబ్బులు కాజేసిన పోలీసులపై కేసు నమోదైంది. ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
కానిస్టేబుల్‌కు ఫుల్‌గా మద్యం తాగించి 'ఖైదీ' పరార్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
సరిహద్దులు దాటిన మరో 'పెళ్లి' కథ.. ఆన్లైన్లో రాజస్థాన్ యువకుడు- పాక్ యువతి వివాహం