Udaipur Accident: రాజస్థాన్ ఉదయ్పుర్లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ మార్కెట్లో ఓ దుకాణం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ హిరణ్గరీ పోలీసులు, సహాయక బృందాలు ఎంబీ ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందిన వెంటనే కలెక్టర్, ఎస్పీ, స్థానిక అధికారులు క్కడకు చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక వ్యాపారులు, ప్రజలు కూడా భారీగా తరలివచ్చారు. భవనం చూస్తుండనే ఒక్కసారిగా నేలమట్టమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఘటనలో గాయపడిన వారిని సీఎం అశోక్ గహ్లెత్ ఎంబీ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వీరంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం ప్రకటించారు. సీఎంతో పాటు కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, రణ్‌దీప్ సూర్జేవాలా కూడా ఆస్పత్రికి వెళ్లారు.