నడుస్తున్న రైలులోనే యువతిపై ఓ దుండగుడు అత్యాచారం చేసి.. ఆపై అందులో నుంచి బయటకు తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం మహారాష్ట్ర వశి రైల్వే బ్రిడ్జి స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఏం జరిగింది?
బాధితురాలు.. మహారాష్ట్ర పొవాయి నగరంలో ఓ ఇంట్లో పని మనిషి. ప్రతి వారం మెట్రో రైలులో టిట్వాలాలో ఉంటున్న తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వస్తూ ఉంటుంది. గత ఆదివారం సాయంత్రం చివరిసారి ఇంటికి వెళ్లి వచ్చిన యువతి.. అప్పటినుంచి తల్లిదండ్రులతో సంభాషించలేదు. అయితే మంగళవారం ఉదయం వశి రైల్వే బ్రిడ్జి దగ్గర ఆమెను గుర్తించిన రైల్వే సిబ్బంది.. స్థానిక రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
యువతి అత్యాచారానికి గురైందని ప్రాథమిక నిర్ధరణకు వచ్చామని పోలీస్ అధికారి భవసాహెబ్ షిండే తెలిపారు. బాధితురాలు కోలుకున్నాక మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. మెరుగైన చికిత్స కోసం యువతిని జేజే ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా నిందితుడి కోసం గాలిస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి : ఇంటికి నిప్పంటుకొని నలుగురు సజీవదహనం