శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది రాహుల్ నాయకత్వానికి కొత్త ఊపు వచ్చిందని, అది ఈ ఏడాది కూడా కొనసాగితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ మార్పు చూసే అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విద్వేష, విభజన బీజాలు నాటొద్దని శివసేన అధికార పత్రిక సామ్నాలో ప్రచురితమయ్యే వారాంతపు కథనం రోక్‌తోక్‌లో సంజయ్‌రౌత్ హితవు పలికారు.
రామ మందిర వివాదం పరిష్కారమైనందున ఆ అంశంపై ఓట్లరను ప్రభావితం చేసే అవకాశం లేదన్నారు. అందువల్ల లవ్ జిహాద్ అనే కొత్త అంశాన్ని ఎత్తుకున్నారని రౌత్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు, హిందువుల్లో భయాలు సృష్టించేందుకు లవ్ జిహాద్‌ను అస్త్రంగా వాడుకుంటారా అని భాజపా నేతలను సంజయ్ రౌత్ ప్రశ్నించారు. తునిషాశర్మ ఆత్మహత్య, ప్రేమికుడి చేతిలో దిల్లీలో హత్యకు గురైన శ్రద్ధా వాకర్ అంశాలను ప్రస్తావించిన ఆయన.. అవి లవ్ జిహాద్ కేసులు కావన్నారు. ఏ మతం లేదా వర్గానికి చెందిన మహిళ కూడా దాడులకు గురికారాదని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.