కరోనా రెండోదశ నేపథ్యంలో ఏప్రిల్లో మూసివేసిన మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయాన్ని ఎట్టకేలకు తిరిగి తెరిచారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా తొలిరోజే షిరిడీ సాయిబాబా మందిరాన్ని భక్తుల కోసం తెరిచారు. దీంతో బాబా దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. కరోనా నిబంధనలను అనుగుణంగా భక్తులను మందిరంలోకి అనుమతించారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి షిరిడీకి చేరుకున్న భక్తులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే హారతి సేవకు 90 మంది భక్తులను మాత్రమే అనుమతించారు.
ఆరు నెలలు తర్వాత తెరిచిన సాయి మందిరాన్ని భక్తులకోసం ప్రత్యేకంగా ముస్తాబు చేసింది షిరిడీ సంస్థాన్ ట్రస్ట్. పూలమాలలతో అలంకరించింది. నవరాత్రుల పూజల సందర్భంగా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం తెరుచుకున్న సంతోషంలో స్థానికులు ద్వారకామాయి ప్రాంతంలో దీపోత్సవాన్ని జరుపుకున్నారు.
వృద్ధులకు నో ఎంట్రీ
ఆలయానికి వచ్చే భక్తులు కరోనా మార్గదర్శకాలను పాటించాలని, మాస్కులను తప్పనిసరిగా ధరించాంలని సూచించారు నిర్వహకులు. గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారిని ఆలయంలోకి అనుమతించరని ముందస్తుగానే వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఇదీ చూడండి: 'ఆమెను నాతో మాట్లాడమని చెప్పు దేవుడా'.. శివుడికి రోజూ భక్తుడి లేఖ!