Congress President Elections Shashi Tharoor : కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో దిగేందుకు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ యోచిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి ఆయనకు అనుమతి లభించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో సంస్కరణలు రావాలని శశి థరూర్ బహిరంగ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే సోనియాతో సమావేశమయ్యారు. కాగా.. కాంగ్రెస్‌లో సంస్కరణల కోసం గత కొన్నేళ్లుగా ఒత్తిడి చేస్తున్న సీనియర్ నేతల్లో థరూర్ కూడా ఉండటం గమనార్హం.
రాహుల్‌పై ఒత్తిడి..
కాంగ్రెస్ సారథ్య బాధ్యతల్ని చేపట్టాలంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతోంది. ఏఐసీసీ పగ్గాలు చేపట్టకూడదన్న భావనతో ఆయన ఉన్నట్టు వార్తలు వస్తున్న వేళ రాహులే సారథ్య బాధ్యతలు చేపట్టాలంటూ పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలంటూ ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ వంటి రాష్ట్రాల పీసీసీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఏఐసీసీకి పంపగా.. తాజాగా ఆ జాబితాలో తమిళనాడు, మహారాష్ట్రలు చేరాయి. సోమవారం జరిగిన తమిళనాడు కాంగ్రెస్ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలంటూ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తీర్మానం ప్రవేశపెట్టగా.. అంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు టీఎన్‌సీసీ ట్విటర్‌లో వెల్లడించింది.
తొలుత రాజస్థాన్ పీసీసీ మద్దతు..
తొలుత రాజస్థాన్ పీసీసీ మద్దతు పలుకగా.. అదేబాటలో వెళ్లిన మరో ఆరు రాష్ట్రాల పీసీసీలు రాహుల్ గాంధీ సారథ్యానికే జై కొడుతూ తీర్మానం చేశాయి. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే ఉండాలంటూ ఇప్పటివరకు మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు, బిహార్‌తోపాటు జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు తీర్మానం చేశాయి. హిమాచల్ ప్రదేశ్ పీసీసీ కూడా త్వరలోనే తీర్మానం చేయనున్నట్లు సమాచారం.
2017లోనూ..
2017లో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే ముందు కూడా పీసీసీలు ఇలాంటి తీర్మానాలే చేసి పంపించిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత రాహుల్ పార్టీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగారు. అప్పట్నుంచి సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 22న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కానుండగా.. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 19న లెక్కింపు, ఫలితం వెలువడనుంది.
ఇవీ చదవండి: 'సీబీఐ, ఈడీ దుర్వినియోగం వెనక మోదీ హస్తం లేదు!'.. దీదీ కీలక వ్యాఖ్యలు