యూపీఏ కూటమికి సారథ్యం వహించబోతున్నారంటూ తనపై వస్తున్న వార్తలను నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఖండించారు. మీడియా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం బలహీనపడిందంటూ.. శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
"యూపీఏ ఛైర్పర్సన్ బాధ్యతలను శరద్ పవార్ చేపడితే మేము చాలా సంతోషిస్తాం. కానీ, ఆయన దానికి అంగీకరించలేదని తెలిసింది. ఒకవేళ ఆయన దానికి అధికారికంగా అంగీకరిస్తే మేము మద్దతు తెలుపుతాం. కాంగ్రెస్ ప్రస్తుతం చాలా బలహీనపడింది. ప్రతిపక్షాలు ఏకమై యూపీఏను శక్తిమంతం చేయాలి."
- సంజయ్ రౌత్, శివసేన నేత.
అంతకుముందు.. ఈ వార్తలు నిరాధారమైనవేనని ఎన్సీపీ స్పష్టం చేసింది. ఈ విషయమై యూపీఏ పక్షాల మధ్య ఎలాంటి చర్చ జరగలేదని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపాసీ పేర్కొన్నారు. రైతు ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి కథనాలను వండి వార్చుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:రైతుల సహనాన్ని పరీక్షించొద్దు: పవార్