కశ్మీర్లో ఐదు రోజుల్లో ఏడుగురు పౌరులను ఉగ్రవాదుల కాల్చి చంపారు. అక్కడి శాంతిభద్రతలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు గంటకు పైగా సమావేశమైన ఆయన.. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని పట్టకోవాలని సూచించిన కేంద్రమంత్రి... ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. ఈమేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు షా.
కేంద్రం వైఫల్యంతోనే ఉగ్రదాడులు..
జమ్ముకశ్మీర్లో పౌరులకు భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలను ఆయన ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు నోట్ల రద్దు తరువాత కానీ ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత కూడా కశ్మీర్లో ఉగ్రవాదం ఆగలేదని రాహుల్ విమర్శించారు. 'మా కశ్మీరీ సోదర, సోదరీమణులుపై జరగిన దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది' అని ట్వీట్ చేశారు.
కశ్మీర్ ప్రజలు హింసకు వ్యతిరేకం...
జమ్ముకశ్మీర్లో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడటాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. సీమాంతర ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్ ప్రజలు హింసకు వ్యతిరేకమని, ఇటీవల జరిగిన పౌర హత్యలు వారి నైతికతను విచ్ఛిన్నం చేయలేవని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. ఉపాధ్యాయుల హత్యలు దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లోయలో గడచిన ఐదు రోజుల్లో ఉగ్రదాడుల్లో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
నిరసనల వెల్లువ...
జమ్ముకశ్మీర్లో సాధారణ ప్రజలనే లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఉగ్రదాడులపై స్థానికంగా ఉండే కొన్ని మైనారిటీ సంస్థలు ఆందోళనకు దిగాయి. శ్రీనగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మహిళా ప్రిన్సిపాల్, టీచర్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కశ్మీర్‌లోయలో గడచిన ఐదు రోజుల్లో ఉగ్రదాడుల్లో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో నలుగురు మైనారిటీలు అన్నారు. ఏడుగురిలో ఆరుగురు శ్రీనగర్‌కు చెదినవారే. దీంతో పనూన్ కశ్మీర్ కార్యకర్తలు జమ్మూలోని దుర్గానగర్ ప్రాంతంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పాక్ దిష్టిబొమ్మను తగలపెట్టిన వీరు.. కశ్మీర్లో మైనారిటీలను రక్షించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: పాఠశాలలో ఉగ్రవాదుల కాల్పులు- ఇద్దరు ఉపాధ్యాయులు మృతి