కర్ణాటక రాజధాని బెంగళూరుకు సిలికాన్ వ్యాలీ అనే పేరుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇదీ ఒకటి. దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు ఔరా అనిపిస్తుంటాయి. అయితే ఇందంతా నాణేనికి ఒకవైపే. అభివృద్ధి పేరుతో ఇక్కడ పర్యావరణం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. సర్జాపుర్ సమీపంలోని హదోసిద్ధపుర సరస్సే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
మురుగు నీరు భారీగా చేరి ఈ సరస్సు కలుషితమైంది. దీంతో పరిష్కారం కోసం భూమి నెట్వర్క్ కాలేజ్ హెడ్ సీత.. 'జల సంరక్షకుడు' ఆనంద్ మల్లిగవాడను సంప్రదించారు. ఈ సరస్సును శుద్ధి చేసేందుకు దేశంలోనే తొలిసారి ఓ వినూత్న పద్ధతిని ఈయన ఉపయోగించారు.

వ్యర్థాల శుద్ధి కర్మాగారం కోసం రూ.కోట్లు ఖర్చు చేయకుండా, సిమెంటు ఎక్కువగా ఉపయోగించకుండా సహజసిద్ధమైన పద్ధతిలో సరస్సును శుద్ధి చేశారు ఆనంద్. దీనికోసం జీవసంబంధ మురుగునీటి శుద్ధి విధానాన్ని అవలంబించారు.
హదోసిద్ధపుర సరస్సు విస్తీర్ణం 35 ఎకరాలు. ఇందులో నీటిని పూర్తిగా ఖాళీ చేసి, బురద తొలగించి, సరస్సు మధ్య మట్టిలో ప్రత్యేక గోడ నిర్మించారు ఆనంద్. రూ.46 లక్షలతో వర్షపు నీరు, డ్రైనేజీ లైన్లను పూల్ ద్వారా వేరు చేశారు. కర్రలు, చెట్లు, మట్టి, ఇసుక, గుళకరాళ్లు ఉపయోగించి సరస్సు నీటిని శుద్ధి చేశారు. 2020 లాక్డౌన్లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు శ్రమించి సరస్సును అభివృద్ధి చేశారు. మరో 10ఏళ్ల వరకు ఇది కలుషితం కాదు. నదిలో ప్రవహించే నీరు లాగే ఈ సరస్సులోని నీరు కూడా శుభ్రంగా ఉంటుంది.
ఈ సరస్సులో ప్రస్తుతం వర్షపు నీరు నిండి ఉంది. చుట్టూ నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. తామర మొక్కలు పెరిగాయి. 55 రకాల జాతులకు చెందిన పక్షులు వస్తున్నాయి. దీంతో ఇది చిన్నపాటి ద్వీపంలా మారి స్థానికులను ఆకర్షిస్తోంది.
పర్యావరణ ప్రేమికుడు..
ఆనంద్ మల్లిగవాడ పర్యావరణ ప్రేమికుడు. ఎన్నో సరస్సులకు పునరుజ్జీవం పోశారు. ప్రకృతితో మనుషులు మమేకవ్వాలని చెట్లను నాటి చిన్నపాటి అడవులనూ సృష్టించేందుకు కృషి చేస్తున్నారు. చాలా ఏళ్లుగా పర్యావరణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బెంగళూరులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు ఎక్కడైనా సరస్సులు, చెరువుల సమస్యలుంటే ముందుగా ఈయన్నే సంప్రదిస్తుంటారు స్థానికులు.

ఐదేళ్ల క్రితం అపార్ట్మెంట్స్ నిర్మించేటప్పుడు మురుగు నీరు నేరుగా వచ్చి ఈ సరస్సులో కలిసేదని స్థానికుడు శ్రీనివాస్ తెలిపారు. ఆనంద్ సాయంతో తమకు ఉపశమనం లభించిందని హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'హిందుత్వంలో హిందూ భావనే లేదు.. అది సంఘీ ధర్మం'