దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 12వ తరగతి బోర్డు పరీక్షలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. బుధవారం భేటీ అయ్యారు. అనంతరం 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వీడియో ప్రకటన విడుదల చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను ఇప్పటికే రద్దు చేసింది.
గుజరాత్‌లోనూ..
గుజరాత్‌లోనూ 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే.. సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా తమ రాష్ట్రంలో బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నామని గుజరాత్ సర్కారు స్పష్టం చేసింది.
ఉత్తరాఖండ్..
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. రాష్ట్ర విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అర్వింద్ పాండే తెలిపారు.
రెండు రోజుల్లో..
సీబీఎస్ఈపై కేంద్రం తాజా నిర్ణయం నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో బోర్డు పరీక్షలను రద్దు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నిపుణులతో సంప్రదింపుల తర్వాత రెండు రోజుల్లోగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి తెలిపారు.
మరోవైపు.. కేంద్రం నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. కరోనా సమయంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించినందుకు.. వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.
'వారి ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి'
సీబీఎస్ఈ తరహాలోనే అన్ని రాష్ట్రాల బోర్డులు కూడా.. 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. విద్యార్థుల బాధను అర్థం చేసుకోవాలని, వారి ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యమివ్వాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యా శాఖ మంత్రులకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయం...
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల రద్దు నేపథ్యంలో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది విద్యార్థుల ప్రతిభను అంచనా వేసేందుకు ఏమేం చేయాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించాలని పేర్కొన్నారు.
"వచ్చే ఏడాది కూడా కరోనా ప్రభావం ఉంటుంది కావచ్చు. 2022 మార్చిలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేసేందుకు ఏం చేయాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించాలి. ఆ ప్రణాళికలు పక్కాగా ఉండాలి."
-మనీశ్ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి.
పరీక్షల నిర్వహణపై తమ సూచనలను సీబీఎస్ఈకి పంపిస్తామని సిసోడియా పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించినా.. నిర్వహించకపోయినా.. విద్యార్థులందరికీ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇదీ చూడండి: ఒకే కాన్పులో పుట్టిన నలుగురు- ఆన్లైన్ క్లాసులకు హాజరు!