హైస్కూలు చదువులు కొనసాగిస్తున్న సమయంలోనే పిల్లలు వ్యసనాల బారిన పడుతున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. బాలురే కాదు.. బాలికల్లోనూ ఈ దురలవాట్లు ఉంటున్నాయి. కౌమార వయస్సులోని పిల్లలు సగటున 14 ఏళ్ల సమయంలో ధూమపానం, 13 ఏళ్ల వయస్సులో మద్యపానాన్ని మొదలుపెడతున్నట్లు సర్వేలో వెల్లడైంది.
15-17 ఏళ్ల వయస్సు పిల్లల్లో వస్తున్న ప్రవర్తనాపరమైన మార్పులు, పొగాకు, మద్యం వినియోగం, తిండి, శారీరక వ్యాయామం, అధికబరువు సమస్యలను తెలుసుకోవడానికి భారత వైద్యపరిశోధన మండలి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ సంస్థలు కలిసి నిర్వహించిన.. 'నేషనల్ నాన్‌కమ్యూనకబుల్ డిసీజ్ మానిటరింగ్ సర్వే 2017-18'లో ఈ వివరాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా 1,402 కుటుంబాలకు చెందిన 1,531 మంది యుక్తవయస్సు పిల్లలు ఈ సర్వేలో పాల్గొని తమ అలవాట్లను పంచుకున్నారు.
బడిలో చేరిక..
సర్వే ప్రకారం.. 95.6% బాలురు, 92.6% బాలికలు కలిపి మొత్తం 94.2% మంది పాఠశాలలకు వెళ్తున్నారు.
ధూమపానం..
పొగతాగే అలవాటు బాలురలో అధికంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని వారికంటే గ్రామీణ ప్రాంతంవారే ఇందుకు అధికంగా అలవాటు పడ్డారు. పట్టణాల్లో బాలబాలికలు 15.1 ఏళ్ల సగటు వయస్సులో ధూమపానం మొదలుపెడుతుండగా, గ్రామాల్లో 13.9 ఏళ్ల వయస్సులోనే ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం 0.3% మంది పిల్లలు ప్రతిరోజూ పొగతాగుతుంటే, 2.9% మంది పొగాకు ఉత్పత్తులకు అలవాటుపడ్డారు.
స్కూళ్లకు 100 మీటర్ల పరిధిలో పొగాకు విక్రయ దుకాణాలున్నట్లు 44.7% మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. 25 నగరాల్లో 72 శాతం విద్యా సంస్థల వద్ద పొగాగు ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతున్నాయి.
మద్యపానం..
తరచూ మద్యం సేవించే పిల్లలు 3.5% మంది ఉన్నారు. ఈ అలవాటు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉంది. పట్టణప్రాంతాల్లోని పిల్లలు సగటున 14.1 ఏళ్ల వయస్సులో మద్యపానం ప్రారంభిస్తుండగా, గ్రామీణప్రాంతాల్లోని యువత 13.1 ఏళ్ల వయస్సులోనే మద్యానికి అలవాటు పడుతున్నారు.
అల్పాహారం..
యుక్త వయస్సు పిల్లలు నెలలో కనీసం మూడొంతుల రోజులు (కనీసం 10 రోజులు) అల్పాహారం తీసుకోవడాన్ని ఎగ్గొడుతున్నారు. ఈ వయస్సు పిల్లలు అధికంగా వేపుడు పదార్థాలు (ఫ్రైడ్ ఐటమ్స్), చిప్స్, నమ్కీన్, తాజా పళ్లు, రసాలు తీసుకుంటున్నారు. వారి ఆహార జాబితాలో ఇన్‌స్టంట్ నూడుల్స్, శీతల పానీయాలు ఉంటున్నాయి. పిజ్జాబర్గర్, ఎనర్జీ డ్రింక్‌లు చివరి స్థానాన్ని ఆక్రమించాయి.
శారీరక వ్యాయామం..
25.2% మంది యువతకు తగినంత శారీరక వ్యాయామం లేదు. రోజుకు సగటున 340.7 నిమిషాలు (దాదాపు అయిదున్నర గంటలు) ఒకేచోట కదలకుండా కూర్చొని ఉంటున్నారు. ఈ జాడ్యం పట్టణప్రాంత బాల, బాలికల్లో అధికంగా ఉంది. ఇక్కడి బాలికలు 392.8 నిమిషాలు, బాలురు 335.1 నిమిషాలు ప్రతిరోజూ ఒకేచోట కదలకుండా ఉంటున్నారు. 6.2% మందిలో అధికబరువు, 1.8% మందిలో స్థూలకాయ సమస్య కనిపిస్తోంది. సగటు బీఎంఐ 18.8 మేర ఉంది. 64.3% మంది పిల్లలు పాఠశాలల్లో శారీరక వ్యాయామం చేస్తున్నారు. అయితే అలా చేసే సగటు సమయం కేవలం 16.1 నిమిషాలు మాత్రమే.
పొగాకు, మద్యపానం దుష్పరిణామాలు, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామ ప్రయోజనాల గురించి 66% స్కూళ్లలోనే పిల్లలకు బోధిస్తున్నారు. పాఠశాలల్లోని క్యాంటీన్లకు 26% పిల్లలు వెళ్తున్నారు. అందులో 88.2% మంది అత్యధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న చిప్స్, నమ్కీన్, సమోసా, కచోరీ, ఇన్‌స్టెంట్ నూడుల్స్, బేకరీ పదార్థాలను తీసుకుంటున్నారు. గ్యాస్‌తో నిండిన పానీయాలు (ఏరేటెడ్ డ్రింక్స్) 41.3%, పండ్లు, సలాడ్‌లు 15.5% మంది తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: 'రిపబ్లిక్ డే'లో ఆకట్టుకున్న మోదీ తలపాగా