తమ కుటుంబంలో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు ఎన్నికల విధులు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఓ సూపర్ డూపర్ ప్లాన్ వేశారు ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు. జులై 8న గ్రామంలో జరగబోయే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ డ్యూటీని తప్పించుకునేందుకు ఏకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. ఈ విచిత్ర సంఘటన బంగాల్ అలిపురద్వార్ జిల్లాలోని జటేశ్వర్ గ్రామంలో జరిగింది.
ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న ఈ ఏడుగురు ఉపాధ్యాయుల కుటుంబంలో జులై 5 నుంచి జులై 7 వరకు వివాహ వేడుకలు జరగనున్నాయి. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడుగురికి తప్పకుండా జులై 8న ఎలక్షన్ డ్యూటీ వేస్తారనే కారణంతో వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈటీవీ భారత్తో చెప్పారు.
"జులై 5న నా కుమారుడి వివాహం, 7న రిసెప్షన్ జరగనున్నాయి. అయితే జులై 8న జరిగే ఎన్నికల కోసం శిక్షణతో పాటు పోలింగ్ డ్యూటీ కూడా వేస్తారు. దీంతో మా ఇంట్లో వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు హాజరయ్యేందుకు అవకాశం లేకుండా పోతుంది. అందుకే నా కుటుంబంలోని ప్రభుత్వ టీచర్లు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు."
- జిబాన్ కృష్ణపాల్, జటేశ్వర్ హైస్కూల్ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
అలిపురద్వార్ జిల్లాలోని పాల్ వంశానికి చెందిన అనేక మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. నిబంధనల ప్రకారం దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ప్రభుత్వ ఉద్యోగులు తప్పక ఎన్నికల విధులు నిర్వర్తించాలి.
రూ.500తో నామినేషన్ దాఖలు..
ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించుకొని పెళ్లికి హాజరుకావాలనే ఒకే ఒక్క కారణంతో వీరు ఒక్కొక్కరు రూ.500 చొప్పున నామినేషన్ రుసుమును ఎన్నికల అధికారులకు చెల్లించి పంచాయితీ ఎన్నికల బరిలో నిలబడ్డారు. దీంతో వీరిని ఎన్నికల కమిషన్ ఎన్నికల విధులకు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఒక్క స్థానానికి 25 మంది పోటీ..
జిల్లాలోని ఫాలాకాటా మండలం జటేశ్వర్ గ్రామ పంచాయితీలోని 12వ నంబర్ వార్డు స్థానానికి జరుగుతున్న ఎన్నికలకు 25 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. వారిలో 22 మంది స్వతంత్ర అభ్యర్థులే కావడం గమనార్హం. వీరిలో ఏడుగురు పెళ్లికి హాజరయ్యే టీచర్లు ఉన్నారు. రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ స్థానానికి ఏకంగా 25 మంది అభ్యర్థులు పోటీ చేయడం ఎప్పుడూ చూడలేదని.. ఇదో రికార్డు అని అలిపురద్వార్ జిల్లా అధికారులు చెబుతున్నారు.
గెలవరని తెలిసినా.. కావాలనే పోటీ..
అయితే ఒక్క స్థానం కోసం నిలబడ్డ వారిలో 90% మంది అభ్యర్థులు కావాలనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని.. వారు ఏ మాత్రం విజయం సాధించరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలిపురద్వార్ జిల్లాలో ప్రధాన పార్టీలుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఐఎంకు ఇప్పటికే గ్రామంలో ఒక్కో పంచాయితీ సీటు ఉంది. అటువంటిది వీరితో స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడి గెలుస్తారా.. లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.