దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేశాయి. మహారాష్ట్ర సర్కారు 15 రోజుల పాటు లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు విధిస్తుండగా దిల్లీ సర్కారు వారాంతపు లాక్‌డౌన్‌ను అమలు చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీల్లోనూ ఆంక్షల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని నగరాలు నిర్మానుష్యంగా మారాయి.
దిల్లీలో..
కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా దిల్లీలో స్మారక కట్టడాలను మూసివేశారు. మే 15 వరకు ఎర్రకోట, కుతుబ్‌మినార్ సహా స్మారక కట్టడాలను మూసివేసి ఉంచుతామని ప్రకటించింది దిల్లీ ప్రభుత్వం.


దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కరోనా పరిస్థితులను సమీక్షించనున్నారు.
'మహా' నగరాలు
రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల కర్ఫ్యూ కొనసాగుతున్న వేళ మహారాష్ట్రలోని ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. పుణె, ముంబయి, బాంద్రా నగరాల్లోని వీధులన్నీ బోసిపోయాయి.



పర్యవేక్షణలో 'భోపాల్'
మధ్యప్రదేశ్ భోపాల్‌లో 'కరోనా కర్ఫ్యూ' ఏప్రిల్ 13 ఉదయం 6 గంటల నుంచి మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే రోడ్లపై తిరిగేందుకు అనుమతిస్తున్నారు పోలీసులు. నిత్యవసరంకాని దుకాణాలన్నీ మూసివేసియడం వల్ల వీధులన్నీ జన సంచారం లేక ఖాళీగా కనిపిస్తున్నాయి.


యూపీలో సండే లాక్డౌన్..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతీ ఆదివారం లాక్డౌన్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అవసరాల మేరకు దుకాణాలు తెరిచేలా నిర్ణయం తీసుకున్నాయి ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు వ్యాపార సంఘాలు.




యూపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై సమీక్షించనున్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్. ఈ మేరకు శుక్రవారం ఉన్నతాధికారులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించనున్నారు.
10 రాష్ట్రాల్లోనే 80 శాతం..
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోనే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బంగలో 79.10 శాతం కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
ఇదీ చదవండి:ఈ ఏడాది సాధారణ వర్షపాతం: ఐఎండీ