Senthil Balaji IT Raid News : తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి. సెంథిల్ బాలాజీకి సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి. మంత్రి సెంథిల్ బాలాజీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ కాంట్రాక్టర్ల నివాసాలు, కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. పలు కీలక దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. చెన్నై, కరూర్‌తో పాటు ఇతర చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ ఇంటివద్దకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు రాగా.. డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు, డీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఐటీ అధికారుల వాహనంపై కార్యకర్తలు దాడికి దిగారు. ఘటనలో కారు అద్దం ధ్వంసమైంది. అక్కడే ఉన్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు.
మరోవైపు.. అన్నాడీఎంకేను వీడి ఇటీవలే డీఎంకేలో చేరిన సెంథిల్ కార్తికేయన్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. కోయంబత్తూరులోని సెంథిల్ కార్తికేయన్ నివాసంలో 10 మంది అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు.
అంతకుముందు కొద్ది రోజుల క్రితం విల్లుపురం, చెంగల్పట్టులో కల్తీ మద్యం ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి సెంథిల్ బాలాజీని పదవిని తొలగించాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేశారు. సెంథిల్‌పై దర్యాప్తును పునఃప్రారంభించాలని పోలీసు క్రైమ్ బ్రాంచ్, ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించాలని కోరారు. సెంథిల్.. రాష్ట్ర కేబినెట్లో కొనసాగితే ఆయనపై విచారణ నిష్పక్షపాతంగా జరగదని అన్నామలై అన్నారు.
రియల్ ఎస్టేట్ కంపెనీపై సోదాలు..
IT Raid In G Square Chennai : ఈ ఏడాది ఏప్రిల్ 24న తమిళనాడుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ జీ స్క్వేర్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత, ఆదాయం లెక్కల్లో అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలకు సంబంధించి 50 పైగా ప్రాంతాల్లో సోదాలు చేసింది. అందులో భాగంగా.. డీఎంకే నేత, అన్నానగర్ ఎమ్మెల్యే మోహన్, ఆయన కుమారుడు కార్తీక్ ఇంటితో సహా కోయంబత్తూర్‌లోని జీ స్క్వేర్ కార్యాలయంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఈ ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ డీఎంకే శ్రేణులు.. ఎమ్మెల్యే మోహన్ ఇంటి ముందు నిరసన చేపట్టాయి.
జీ-స్క్వేర్ సంస్థ తక్కువ ధరలకు ఆస్తులు కొని.. వాటిని అధిక ధరలకు అమ్ముతోందని ఐటీ అధికారులు చెప్పినట్లు సమాచారం. కానీ, వసూలు చేసిన ఎక్కువ మొత్తానికి పన్నులు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, దాడులు చేసే సమయంలో ఐటీ శాఖ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. వారి బదులు సీఏపీఎఫ్ (కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు) సాయం తీసుకున్నారు. జీ స్క్వేర్ కంపెనీపై దాడులు జరగడం ఇదే మొదటి సారి కాదు. పన్ను ఎగవేత ఆరోపణలతో 2019లో కూడా ఐటీ దాడులు జరిగాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.