దేశ వ్యూహాత్మకతను కొనసాగించడానికి రక్షణ పరికరాల తయారీలో స్వావలంబన సాధించడం కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బెంగళూరులోని ఏరో ఇండియా 2021, స్టార్ట్ప్ మంతన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంకురాలు తమ వస్తు సేవల సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ కార్యక్రమం మంచి అవకాశమని చెప్పారు. ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడీఈఎక్స్) చొరవతో రక్షణ రంగంలో అంకురాల ఆవిష్కరణలకు అవకాశం లభించిందని పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థ అంకురాలతోనే...
దేశంలో రక్షణ రంగంలో అంకురాల అవిష్కరణలకు అదనపు ప్రోత్సాహం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్యంతోనే ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలు చేపట్టాం. సరళీకరణ, నిధులు, ప్రోత్సహకాలు, పరిశ్రమలు-విద్యాభాగస్వామ్యాల పైనే స్టార్టప్ ఇండియా ఆధారపడి ఉంటుంది. వివిధ పథకాల ద్వారా రూ.4500కోట్లతో 384 అంకురాల్లో పెట్టుబడులు పెట్టాము. స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న 45 సంస్థలు ఇప్పటికే రూ.203 కోట్ల లబ్ధి పొందడం సంతోషాన్ని కల్గించింది. అంకురాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తాం.
-రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి
మిత్ర దేశాలకు రక్షణ సామగ్రిని ఎగుమతి చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ చెప్పారు. తేలికపాటి యుద్ధ విమానాలు, క్షిపణులు, హెలికాప్టర్లు, ట్యాంకులు, ఫిరంగులతో సహా ఇతర ఆయుధ వ్యవస్థలను సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.