Schools Reopen in AP: సమ్మర్ హాలీడేస్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసి అమ్మమ్మ, నానమ్మ వాళ్ల ఊరు వెళ్లొచ్చి సందడి సందడిగా గడిపిన పిల్లలకు రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఊర్లకు వెళ్లిన చాలా మంది పిల్లలు తిరుగుపయనమయ్యారు. అయితే చాలా మంది చిన్నారులు స్కూల్ ఫస్ట్డేనే వెళ్లాలంటే మొండికేస్తారు. ఇన్నిరోజులు సెలవుల్లో హాయిగా గడిపి ఇప్పుడు స్కూలుకు వెళ్లడానికి ఇష్టపడరు. మరోవైపు పిల్లలను మొదటిరోజే పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు సైతం సుముఖంగా లేరు. కారణం మండుతున్న ఎండలు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దంచికొడుతున్నాయి. ఓ వైపు వేడిగాలులు, మరోవైపు ఉక్కపోతలు, విపరీతంగా పెరిగిన ఎండలతో పిల్లల నుంచి పెద్దల వరకు అల్లాడిపోతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద కూర్చొని ఎండవేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులు కాస్తా జంకుతున్నారు. పాఠశాలల ప్రారంభమైన మొదటి రోజు నుంచి పంపడానికి వెనకడుగు వేస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా అటు తల్లిదండ్రులు, ఇటు ప్రతిపక్ష నేతలు సెలవులు పొడిగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కాకపోతే అందులో కొన్ని సడలింపులు చేసింది.
రేపటి నుంచి రెండు పూటలు కాకుండా.. ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. రేపటి(జూన్ 12) నుంచి 17వరకు ఒంటిపూట మాత్రమే నిర్వహించనున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉష్ణోగ్రతలు, వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం ఏడున్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 19 నుంటి యథాతథంగా విద్యా ప్రణాళిక షెడ్యూల్ అమలుకానున్నట్లు పేర్కొంది. అలాగే ఉదయం 8.30 నుంచి 9 గంటలలోపు రాగిజావ పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు.
రేపటి నుంచి విద్యా కానుక కిట్ల పంపిణీ: రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా అదే రోజున విద్యా కానుక పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటించి.. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లను ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి క్రోసూరు చేరుకోనున్నారు. ఏపీ మోడల్ స్కూల్ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయనున్నారు. బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి, విద్యార్ధులకు కిట్స్ అందజేయనున్నారు. అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకోనున్నారు.
నారా లోకేశ్: రాష్ట్రంలో నేటికీ ఎండలు మండిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇప్పుడు స్కూళ్లు తెరవడమంటే విద్యార్థులకు ఇబ్బందే అని.. కనీసం వారం రోజులు సెలవులు పొడిగించాలనేది తల్లిదండ్రుల అభిప్రాయం అని తెలిపారు. ఈ మేరకు సమాచారం తెప్పించుకుని సెలవులపై సీఎం నిర్ణయం తీసుకోవాలని లోకేశ్ కోరారు.