రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రకృతి ఒడిలో పిల్లలకు తరగతులు చెప్పడం మంచిదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)(ICMR News) పేర్కొంది. కొవిడ్ మహమ్మారి కాలంలో పాఠశాలలు దీర్ఘకాలం మూసేయడం పిల్లల సంపూర్ణ వికాసంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటిని క్రమంగా తెరవడానికి(Schools Reopening) ప్రయత్నించాలని సూచించింది. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, శాస్త్రవేత్తలు తను ఆనంద్, సమీరన్ పాండాలు రాసిన పరిశోధన పత్రం ఇండియన్ జర్నల్ మెడికల్ రీసెర్చ్‌లో(ICMR on School Reopening) ప్రచురితమైంది. పిల్లల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దశలవారీగా పాఠశాలలు తెరవడంతోపాటు, మంచి గాలీవెలుతురు, కొవిడ్ జాగ్రత్తల మధ్య తరగతులు నిర్వహించాలని సిఫార్సు చేసింది. తొలుత ప్రాథమిక పాఠశాలలు, ఆ తర్వాత మాధ్యమిక పాఠశాలలు, ఆ తర్వాత ఆపైస్థాయి విద్యాసంస్థలను తగిన ముందు జాగ్రత్తలతో తెరవాలని సూచించింది.
- దేశంలో వ్యాక్సినేషన్(Vaccination in India) ప్రాధాన్య వర్గంలో ఉపాధ్యాయులు లేకపోయినా వారితోపాటు బోధనేతర సిబ్బంది, రవాణా సిబ్బందికి అత్యవసర ప్రాతిపదికన టీకాలు అందించాలి.
- వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వారు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలి.
- తరగతిలోని పిల్లలను తరచూ పరిశీలిస్తూ ఉండటంవల్ల వైరస్ సోకిన వారిని గుర్తించి వెంటనే వేరు చేయొచ్చు. అందువల్ల పాఠశాల సిబ్బంది, పిల్లలకు తరచూ పరీక్షలు నిర్వహిస్తూ ఉండాలి. దానివల్ల వైరస్ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే అరికట్టడానికి వీలవుతుంది.
- సాధారణంగా ఉష్ణోగ్రతలు చూడటం, లక్షణాలను గమనించడం లాంటి చర్యలవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి వెంటనే దాన్ని పరిహరించాలి. దానికి బదులు ప్రతి పాఠశాలలో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసుకోవడం మంచిది.
- స్థానికంగా వైరస్ వ్యాప్తి పెరిగినప్పుడు తాత్కాలికంగా పాఠశాలలు మూసేయాలి.
- వైరస్ వ్యాప్తి నిరోధించడానికి తగిన వెలుతురు ముఖ్యం. అందువల్ల తరగతి గదుల్లోకి తగిన విధంగా గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఎయిర్ కండీషన్ల వినియోగాన్ని మానేయాలి.
- రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌లో పిల్లలకు చెట్ల పాఠాలు బోధించినట్లుగా ప్రకృతి ఒడిలో పిల్లలకు చదువులుచెప్పే విధానాన్ని అనుసరించాలి. నెదర్లాండ్స్, అమెరికా, డెన్మార్క్‌లాంటి చాలా దేశాల్లో పాఠశాలలు బహిరంగ స్థలాల్లో నిర్వహిస్తున్నారు.
- పిల్లలను విశాలమైన చోట కూర్చోబెట్టాల్సి ఉన్నందున అసెంబ్లీ హాళ్లు, ఇతర విస్తృతమైన స్థలాలను తరగతుల కోసం ఉపయోగించుకొనే ప్రయత్నం చేయాలి.
- పిల్లలు భోజనాలను పరస్పరం మార్చుకోవడం, క్యాంటీన్లు, భోజనశాలల్లో సుదీర్ఘంగా కూర్చోవడం లాంటివి చేయకుండా చూడాలి.
- ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌తో కూడిన హైబ్రిడ్ మోడల్‌ను కచ్చితంగా కొనసాగించాలి.
- కొందరు పిల్లలకు రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలి.
- మిగతా పిల్లలు రోజు విడిచి రోజు పాఠశాలలకు వచ్చేలా చూసుకోవాలి.
ఇదీ చదవండి:టీకా రెండో డోసు మిస్ అయ్యారా? అయితే మీరు మళ్లీ..