ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ దెహాత్ జిల్లాలో విద్యార్థినిపై ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉంటున్న ఓ మహిళ ఇంటికి వెళ్లిన బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగొట్టాడు. ఈ మొత్తం దారుణాన్ని సదరు మహిళ.. వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది.
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు ప్రకారం..
జిల్లాలోని రూరా పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన బాధితురాలు (14).. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుతోంది. రోజూ వ్యాన్లోనే స్కూల్‌కు వెళ్లి వస్తుంటుంది. అయితే 15 రోజుల క్రితం.. బాధితురాలి పక్క ఇంటికి వారు ఊరికి వెళ్లారు. ఆ సమయంలో వారి ఇంట్లో ఒక్క మహిళ మాత్రమే ఉంది. ఆమె బాధితురాలిని తన ఇంటికి పిలిచి.. తోడుగా పడుకోమని కోరింది. అయితే విద్యార్థిని.. తన తల్లిదండ్రుల అంగీకారంతో మహిళ ఇంటికి వెళ్లింది.
ఆ తర్వాత పక్క ఇంట్లో ఉన్న మహిళ.. వ్యాన్ డ్రైవర్ నౌషాద్కు ఫోన్ చేసింది. వెంటనే వచ్చిన అతడు.. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మొత్తాన్ని సదరు మహిళ వీడియో తీసింది. సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేయడం వల్ల వైరల్‌గా మారింది. భయంతో బాధితురాలు.. ఈ విషయాన్ని తన ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.
వీడియో వైరల్ కావడం వల్ల బాధితురాలి ఇంట్లో ఈ విషయం తెలిసింది. అప్పుడు విద్యార్థినికి అడగ్గా.. జరిగినదంతా చెప్పింది. వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు నౌషాద్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
బీజేపీ బూత్ అధ్యక్షుడు దారుణ హత్య!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ జిల్లాలో బీజేపీ బూత్ అధ్యక్షుడిని గుర్తుతెలియని వ్యక్తులు.. దారుణంగా దాడి చేసి హత్య చేశారు. పాత కక్షలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. జిల్లాలోని సంగ్రామ్పుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఖౌపుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం.. బీజేపీ బూత్ అధ్యక్షుడు దినేశ్ సింగ్‌పై ముగ్గురు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. బైక్‌పై వచ్చి పదునైన ఆయుధాలతో గాయపరిచారు. అనంతరం కొట్టి చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు.
వెంటనే స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దినేశ్ సింగ్‌ను సంగ్రామ్పుర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉందని.. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. హుటాహుటిన దినేశ్ సింగ్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
దినేశ్ సింగ్ హత్యకు పాతకక్షలే కారణమని తెలుస్తోంది. ఆయన సోదరుడు పదేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ప్రధాన సాక్షి దినేశ్ సింగే. అందుకే ఆయనను చంపేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. అయితే ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కుటంబసభ్యులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుమంటామని చెప్పారు.