బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ కేసులో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ ఎస్.ఏ. బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 18న బహదూర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసింది.
ఏమిటి కేసు?
2019 ఎన్నికల్లో తేజ్ బహదూర్ ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా వారణాసిలో పోటీకి నామినేషన్ వేశారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అభ్యర్థిగా తేజ్ బహదూర్ నామపత్రం సమర్పించారు. ఉద్యోగ కాలంలో ఎలాంటి రాజద్రోహం, అవినీతికి పాల్పడలేదన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలని బహదూర్‌ను కోరింది ఎన్నికల సంఘం. గడువులోగా సర్టిఫికేట్ సమర్పించనందున ఆయన నామినేషన్‌ను 2019 మే 1న తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించారు బహదూర్. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దీనితో సుప్రీంను ఆశ్రయించారు బహదూర్. ఇరు పక్షాల వాదనను విన్న సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించనుంది.
బహదూర్ వీడియో వివాదం..
గతంలో సరిహద్దు భద్రతా దళ సైనికుడిగా పనిచేసిన బహదూర్.. సైనికులకు వడ్డించే ఆహారంపై ఫిర్యాదు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు. ఫలితంగా 2017లో ఆయన్ను ఉద్యోగం నుంచి తప్పించారు అధికారులు.
ఇదీ చూడండి:బంగాల్ దంగల్: దీదీ సేనలో అసమ్మతి జ్వాల!