నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం చర్య పట్ల తాము నిరాశతో ఉన్నామని సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు నేడు విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చట్టాల అమలును కొంతకాలం నిలిపివేస్తారా లేదా కోర్టునే ఆ పని చేయమంటారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
"సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య జరుగుతున్న ప్రక్రియ పట్ల అసంతృప్తిగా ఉన్నాం. అసలు చర్చల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆందోళనల్లో పాల్గొన్న కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అసలేం జరుగుతోంది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మా చేతులకు రక్తం అంటుకోవాలని మేం కోరుకోవట్లేదు"
- సీజేఐ జస్టిస్ బోబ్డే
దేశమంతా సాగు చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటులో ఉందని ధర్మాసనం పేర్కొంది. చట్టాల్ని రద్దు చేయాలని తాము చెప్పడం లేదని, సమస్యకు పరిష్కారం కనుగొనడమే తమ లక్ష్యమని చెప్పింది. చట్టాల్ని కొంతకాలం నిలివేయగలరా..? అని సర్కార్ను ప్రశ్నించింది. చట్టాలు ప్రయోజకరమేనని చెప్పేందుకు ఒక్క ఉదాహరణ కూడా కన్పించట్లేదని వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారానికి కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీ తన నివేదిక ఇచ్చే వరకు వ్యవసాయ చట్టాల్ని నిలిపివేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
ఇక రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, ఆందోళనను మరో చోటు మార్చుకునే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రైతులు తమ ఇబ్బందులను కమిటీకి తెలియజేయాలని, వాటిని కోర్టు పరిశీలిస్తుందని వెల్లడించింది.
చట్టాల్ని నిలిపివేయడం సాధ్యం కాదు..
చట్టాలను నిలిపివేయడం కుదరదని, అయితే దీనిపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయొచ్చని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప చట్టాన్ని నిలిపివేసే హక్కు న్యాయస్థానాలకు లేదు అని ఆయన చెప్పారు. సుప్రీం గత తీర్పులు కూడా ఇదే చెబుతున్నాయని గుర్తుచేశారు. అంతేగాక కొత్త చట్టాలపై యావత్ దేశం సంతృప్తిగా ఉందని, కేవలం రెండు, మూడు రాష్ట్రాల వారే ఆందోళన చేస్తున్నారని వివరించారు.