స్వతంత్ర, నియంత్రణ మీడియా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలన్న పిటిషన్పై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.
మీడియా సంస్థలపై వీక్షకులు చేసే ఫిర్యాదులు వినేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్తలు నిలేష్ నవలఖా, నితిన్ మేమనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది.
మీడియా అదుపుతప్పి వ్యవహరిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛా హక్కుకు లోబడేలా దానిని నియంత్రించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. అందుకోసం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జి అధ్యక్షతన ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి న్యాయపరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. తమ ఉద్దేశం మీడియా హక్కులను అణచివేయడం కాదని తెలిపారు. తప్పుడు సమాచారం, గోప్యత ఉల్లంఘనకు బాధ్యత వహించేలా చేయడమేనని అన్నారు.
ఇదీ చూడండి: దక్షిణాదిలో సుప్రీం ధర్మాసనం అవసరం