రాజ్యాంగ సవరణలు, సహకార సంఘాల నిర్వహణ అంశంలో సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలువరించింది. రాష్ట్రాల పరిధిలోని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేసే చట్టాలు చెల్లుబాటు కాబోవని స్పష్టం చేసింది. సహకార సంఘాల నిర్వహణ విషయమై యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 97వ రాజ్యాంగ సవరణ తీరును తప్పుపట్టింది.
అయితే, బహుళ రాష్ట్రాల్లో కార్యకలాపాలుండే సహకార సంఘాల కోసం రాజ్యాంగ అధికరణం 243జెడ్ ఆర్‌లో చేర్చిన పార్ట్ 9బి నిబంధనలను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే అంశమై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 97వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు ధర్మాసనం 2:1 మెజార్టీతో సమర్థించింది. రాష్ట్రాల పరిధిలోని అంశమైన సహకార సంఘాల నిర్వహణ నిబంధనల్లో ఏకపక్షంగా సవరణలు చేయడాన్ని రద్దు చేస్తూ గుజరాత్ హైకోర్టు 2013లో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.ఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
నిబంధనలు వర్తించవు
"వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే బహుళ రాష్ట్ర సహకార సంఘాలకు మాత్రమే రాజ్యాంగంలోని 243జెడ్‌ఆర్‌లో చేర్చిన 9బి నిబంధనలు చెల్లుబాటు అవుతాయి. ఇతర సహకార సంఘాలకు కేంద్ర చట్టంలోని నిబంధనలు వర్తించవు" అని ధర్మాసనం పేర్కొంది. ముగ్గురు సభ్యుల ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లు 97వ రాజ్యాంగ సవరణలోని పైన పేర్కొన్న భాగాన్ని సమర్థించగా...జస్టిస్ కె.ఎం.జోసెఫ్ ఈ సవరణ మొత్తాన్ని రద్దు చేయాలంటూ భిన్నమైన తీర్పును రాశారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో 97వ రాజ్యాంగ సవరణకు 2011లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. అధికరణం 19(1)(సి)కి మార్పులు చేయడంతో పాటు అధికరణం 243జెడ్‌ఆర్‌లో పార్ట్ 9బిని అదనంగా చేర్చింది. ఈ సవరణలను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టులో సవాల్ చేయగా కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా 2013లో తీర్పు వెలువడింది. దీనిని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సవాల్ చేయగా తాజా తీర్పు వెలువడింది. కొత్తగా చేర్చిన 9బి...రెండు అంతకుమించిన రాష్ట్రాల్లో కొనసాగే సహకార సంఘాల పనితీరును మెరుగుపరిచేందుకు పాలకమండలిలో సభ్యులు, కార్యవర్గ సభ్యుల సంఖ్యకు పరిమితులు, పదవీ కాలవ్యవధి, ఎన్నికల నిర్వహణ, ఆడిటింగ్, జమాఖర్చుల సమర్పణ, నిష్ణాతులైన వ్యక్తుల నియామకాలకు సంబంధించి కొన్ని నిబంధలను విధించింది.
వివాదం ఏమిటంటే..
సహకార సంఘాలు...రాష్ట్ర పరిధిలోని అంశం. ఇటువంటి అంశాలపై కేంద్ర చట్టం చేసినప్పుడు అధికరణం 368 ప్రకారం దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల ఆమోదాన్ని పొందాలి. కేంద్రం ఈ నిబంధనను ఉల్లంఘించింది కనుక 97వ రాజ్యాంగ సవరణ చెల్లదంటూ గుజరాత్ హైకోర్టు తీర్పు నివ్వటాన్ని సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది. అయితే, ఒకటికి మించిన రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిర్వహించే (బహుళ రాష్ట్ర) సహకార సంఘాల విషయంలో ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సంఘాల కోసం పార్ట్ 9బిలోని నిబంధనలను జస్టిస్ నారిమన్, గవాయ్‌లు సమర్థించారు.
జస్టిస్ జోసెఫ్ మాత్రం రాజ్యాంగ సవరణ 97ను మొత్తంగా రద్దు చేయాలని తీర్పు రాశారు.బహుళ రాష్ట్ర సహకార సంఘాలకే రాజ్యాంగ సవరణ(97) వర్తిస్తుంది. ఈ కేటగిరీలోకి రాని సహకార సంఘాలకు సంబంధించి రాష్ట్రాలు తగిన విధంగా చట్టాలు చేసుకోవచ్చని, 97వ రాజ్యాంగ సవరణ రద్దు లేదా కొనసాగింపు ప్రభావం వాటిపై ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'మధ్యవర్తిత్వ తీర్పులను కోర్టులు మార్చలేవు'