భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) పదవిలో ఇంతవరకు ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టులో బుధవారం వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం వల్ల లైంగిక హింస వంటి కేసుల్లో సమతుల్యత పెరుగుతుందని అన్నారు.
సుప్రీంకోర్టులో మొత్తం కేటాయించిన 34 మంది మహిళా న్యాయమూర్తుల్లో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. దేశంలోని అన్నిహైకోర్టుల్లో 1,113 మంది మహిళా న్యాయమూర్తులను కేటాయించగా.. 80 మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే విధుల్లో ఉన్నారని చెప్పారు.
లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి 'రాఖీ' కట్టాలనే నిబంధన మీద ఓ నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల బెయిల్ ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అపర్ణ భట్ అనే న్యాయవాది.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లైంగిక హింసకు గురైన బాధితురాలిని నిందితుని సమక్షంలోకి వెళ్లకుండా చర్యలు తీసకోవాలని న్యాయస్థానాన్ని భట్ కోరారు. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చూడండి:దర్యాప్తు సంస్థల్లో సీసీటీవీల ఏర్పాటుకు సుప్రీం ఆదేశం