నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో రైతులు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసనలు చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వారికి కరోనా వ్యాప్తి నుంచి రక్షణ లభిస్తోందా అని ప్రశ్నించింది.
ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ వద్ద ప్రజలు గుమిగూడటం సహా లాక్డౌన్ విధించిన తర్వాత నిజాముద్దీన్ మర్కజ్లో తబ్లిగీ జమాత్ సమావేశం నిర్వహించడంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ సాగించింది. వాదనల సందర్భంగా రైతుల నిరసనలను ప్రస్తావించింది.
"రైతుల నిరసనల విషయంలోనూ ఇదే(కరోనా వ్యాప్తి) సమస్య ఉత్పన్నమవుతుంది. కరోనా నుంచి రైతులకు రక్షణ లభిస్తుందో లేదో తెలియదు. కాబట్టి ఇదే సమస్య మళ్లీ మొదలవుతుంది. ఇది ఇప్పుడే పూర్తిగా ముగిసిపోలేదు."
-జస్టిస్ ఎస్ఏ బోబ్డే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
కరోనా నుంచి రైతులకు రక్షణ లభిస్తోందా అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. దానికి 'లేద'ని సమాధానం ఇచ్చిన మెహతా.. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, చేపట్టాల్సిన పనుల గురించి రెండు వారాల్లో సవివర నివేదిక సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు.
నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ ఇప్పటికీ అరెస్టు కాలేదని, తబ్లిగీ జమాత్ సమావేశం జరగకుండా ఆపడంలో దిల్లీ పోలీసులు విఫలమయ్యారని న్యాయవాది సుప్రియా పండితా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు, తబ్లిగీ కార్యక్రమం సహా, ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ వద్ద ప్రజలు గుమిగూడటంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని ఇదివరకే కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇదీ చదవండి: పోరుబాటలో అన్నదాతలు- ట్రాక్టర్ ర్యాలీతో నిరసన